AP Govt: సీఐడీకి చంద్రయ్య హత్య కేసు
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:26 AM
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

వైసీపీ ప్రభుత్వంలోదారుణ హత్యకు గురైన టీడీపీ కార్యకర్త
పల్నాడులో పట్టపగలు పీక కోసి చంపిన ప్రత్యర్థులు
ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేసినా బెయిల్‌పై బయటికి
పిన్నెల్లి అండతో తిరిగొచ్చి అరాచకాల కొనసాగింపు
కూటమి ప్రభుత్వం రాకతో ఇతర రాష్ట్రాలకు పలాయనం
మాచర్లటౌన్, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసును రీఓపెన్ చేయాలని భావించిన ప్రభుత్వం తదుపరి చర్యల్లో సీఐడీకి అప్పగించాలని నిర్ణయించుకొని ఫైల్‌ను వెంటనే సీఐడీకి పంపాలని ఆదేశించింది. గుండ్లపాడులో 2022 జనవరి 13న తోట చంద్రయ్యను వైసీపీ నేతలు పట్టపగలు ఊరి మధ్యలో అందరూ చూస్తుండగానే గొంతు కోసి చంపారు. వైసీపీ పాలనలో టీడీపీని వీడి వైసీపీలో చేరాలని బెదిరించినా ససేమిరా అనడంతోనే చంద్రయ్యను హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి.
సంచలనం సృష్టించిన కేసు
2022లో జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా నియమించారు. ఆతర్వాత తొలిసారిగా నియోజకవర్గంలోకి వస్తున్న బ్రహ్మానందరెడ్డికి టీడీపీ శ్రేణులు భారీగా స్వాగతం పలుకుతూ ర్యాలీ నిర్వహించాయి. తోట చంద్రయ్య కూడా తన స్వగ్రామమైన గుండ్లపాడు నుంచి కార్యకర్తలతో ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో వైసీపీ నేతలకు ఆయన టార్గెట్ అయ్యారు. చంద్రయ్యను హత్య చేస్తే తమకు ఎదురుండదని భావించిన వైసీపీ నేతలు చంద్రయ్యను హత్య చేశారు. ప్రత్యర్థులు పీక కోస్తున్నా ‘జై చంద్రబాబు’ అంటూ చంద్రయ్య ప్రాణాలు విడిచారు. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. చంద్రబాబు స్వయంగా గుండ్లపాడు వచ్చి నివాళులర్పించారు. చంద్రయ్య కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. శ్మశాన వాటిక దాకా పాడె మోశారు.
పిన్నెల్లి సోదరుల వద్ద ఆశ్రయం..
చంద్రయ్య హత్య కేసులో గ్రామానికి చెందిన ఎంపీపీ చింతా శివరామయ్య, అతని తనయుడు ఆదినారాయణ, అల్లుడు తోట అంజితోపాటు మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. ఆ ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడంతో కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం వారంతా బెయిల్‌పై విడుదలై అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిల వద్ద ఆశ్రయం పొందారు. మరికొంత కాలానికి గ్రామానికి తిరిగొచ్చి టీడీపీ వారిని వేధించి, కేసులతో వేధించి.. గ్రామం నుంచి తరిమేశారు.
ప్రత్యర్థుల్లో వణుకు..
చంద్రయ్య హత్యను పార్టీ అధినేత చంద్రబాబు సవాల్‌గా తీసుకున్నారు. హత్య వెనుక ఎవరి కుట్ర ఉంది. పాత్రదారులకు సహకరించిన సూత్రధారులెవరో నిగ్గుతేల్చి కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో కేసును సీఐడీకి అప్పగించారు. దీంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. రాష్ట్రంలో వైసీపీ పాలన పోయి కూటమి ప్రభుత్వం రాగానే వారిలో చాలామంది.. గ్రామాలను వీడి ఇతర రాష్ట్రాల్లో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు.