Share News

AP Govt: ‘ఆడుదాం..’ అవినీతిపై ఏసీబీ విచారణ

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:01 AM

‘ఆడుదాం.. ఆంధ్రా’లో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత జగన్‌ ప్రభుత్వం ఎన్నికల చివరి ఏడాది ఈ కార్యక్రమం పేరిట రాష్ట్రమంతటా ఓట్లాట సాగించింది.

AP Govt: ‘ఆడుదాం..’ అవినీతిపై ఏసీబీ విచారణ

  • నాలుగున్నరేళ్లు క్రీడల్ని గాలికొదిలేసిన వైసీపీ.. చివరి ఏడాది మాత్రం రాష్ట్రమంతటా ఓట్లాట

  • టీ షర్టులపై వైసీపీ రంగులు, జగన్‌ బొమ్మలు.. ప్రచార వ్యయమంతా అస్మదీయుల జేబుల్లోకి

  • మైదానంలో వైసీపీ కార్యకర్తలదే హడావుడి.. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట రూ.119 కోట్లు ఖర్చు!

  • క్రీడాకారులకు నాసిరకం కిట్లు.. ఈవెంట్‌ నిర్వహణ, ముగింపు సభ, ప్రైజ్‌మనీ.. అన్నిట్లో దోపిడే

  • అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం

  • నాటి మంత్రి రోజా, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డిపై ఆరోపణలు

అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ‘ఆడుదాం.. ఆంధ్రా’లో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత జగన్‌ ప్రభుత్వం ఎన్నికల చివరి ఏడాది ఈ కార్యక్రమం పేరిట రాష్ట్రమంతటా ఓట్లాట సాగించింది. రూ.వంద కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ‘ఆడుదాం ఆంధ్రా’లో అసలు ఏం జరిగిందన్న దానిపై వాస్తవాలు బయటికి తీసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు అసెంబ్లీలో మంగళవారం ప్రభుత్వం ప్రకటన చేసింది. నిజానికి, అప్పట్లో తొలి నాలుగున్నరేళ్ల పాటు శాప్‌ను, క్రీడలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఎన్నికలకు ముందు మాత్రం హడావుడి మొదలుపెట్టింది. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ కొత్తరకం అవినీతికి తెర తీశారు. మంత్రి రోజా, శాప్‌ చైర్మన్‌ సిద్ధార్థరెడ్డి చెప్పిన వారికి వర్కర్‌ అర్డర్లు ఇవ్వడం, నచ్చిన వారికి ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా భారీగా వెనుకేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తొలుత రూ.50 కోట్లతో మొదలుపెట్టి అమాంతంగా దానిని రూ.119 కోట్లకు పెంచి ‘దోచుకుందాం’ ఆట మొదలుపెట్టారు. అయితే, మొత్తం ఎంత ఖర్చు ఎంతయింది ఎక్కడా లెక్కలు లేవు. దీనిపై చీకటి జీవోలు తెచ్చి వాటిని దాచేశారు. మొత్తం స్పోర్ట్స్‌ కిట్లు, యాప్‌, టీ - షర్టులు, బ్రోచర్లు, క్రీడల నిర్వహణ, రవాణా, ఫుడ్‌ అండ్‌ ప్రైజ్‌ మనీ, ముగింపు రోజు ఏర్పాట్లు.. ఇలా మొత్తం రూ.119 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పేరుకు ఇది ప్రభుత్వ కార్యక్రమం.


కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ చాలా క్రీడలు జగన్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలతోనే ఆడించారు. ఎక్కడ చూసినా జగన్‌ బొమ్మలు, కొన్ని చోట్ల వైసీపీ రంగులు... కొన్నిచోట్ల ఓడిపోయిన వారిని గెలిపించారనీ, గెలిచిన వారిని ఓడినట్టు ప్రకటించారన్న విమర్శలు వచ్చాయి. మరోవైపు నిజమైన క్రీడాకారులను పట్టించుకోలేదు. సరైన భోజన సదుపాయాలు కూడా కల్పించలేదు. క్రీడలకు కూడా రాజకీయ, కులం రంగులు అద్ది ప్రతిభకు పాతరేశారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి.

ఆ అధికారులే కూటమిలోనూ కీలకం

స్పోర్ట్స్‌ కిట్ల కొనుగోలు ప్రక్రియను ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. కిట్ల కోసం రూ.38.55 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పినా, అందులో దోచేసిందే ఎక్కువ. క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేశారు. యాప్‌లు, ప్రచార నిర్వహణ పనులను అస్మదీయులకు అప్పగించి దాదాపు రూ.రెండు కోట్లు వారి జేబులో పెట్టారు. స్పోర్ట్స్‌ కిట్ల కొనుగోలులో కొంత మంది అధికారులు పాత్ర కూడా ఉన్నట్టు అప్పట్లో విమర్శలు వచ్చాయి. వారే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ కీలకమైన పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. రూ.34..20 కోట్లతో టీ -షర్టులు కొనుగోలు చేశారు. వాటిపై వైసీపీ జెండా రంగులు, జగన్‌ బొమ్మలు ముద్రించారు. బ్రోచర్ల పేరిట మరో రూ.3.43 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాల కలెక్టర్లకు దాదాపు రూ.40 కోట్లు విడుదల చేశారు. జిల్లాల్లో స్పోర్ట్స్‌ నిర్వహణకు రూ.21 కోట్లు, క్రీడాకారుల తరలింపుకు రూ.76 లక్షలు, వారికి ఆహారానికి రూ.4.26 కోట్లు, ప్రైజ్‌ మనీ కోసం దాదాపు రూ.12.21 కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొన్నారు. ముగింపు కార్యక్రమానికి రూ.2.70 కోట్లు వెచ్చించినట్టు నిర్వాహకులు ప్రకటించారు.


ఆ ఐదేళ్లూ క్రీనీడలే..

రాష్ట్రంలో 2019 నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో అనేక మంది క్రీడాకారులు పతకాలు సాధించారు. వారికి జీవోల ప్రకారం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉండగా, నిధులు లేవంటూ ఎగ్గొట్టారు. కీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికీ సుముఖత చూపలేదు. క్రీడా సంఘాలకు ఇవ్వాల్సిన గ్రాంట్లు, ఒలింపిక్‌ అసోసియేషన్‌కు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. 2023లో గుజరాత్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో మనవాళ్లు సత్తా చాటారు. ఏసీబీ దృష్టిసారిస్తే మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Mar 12 , 2025 | 05:03 AM