Ministry of External Affairs: మత్స్యకారులను రప్పించేందుకు ప్రయత్నాలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:23 AM
సముద్రంలో చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు చిక్కిన విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విదేశాంగ శాఖతో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు
అమరావతి/శ్రీకాకుళం/విజయనగరం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్టుగార్డుకు చిక్కిన విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రంతో నిరంతరం మాట్లాడుతోంది. విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి డి.శ్యామ్‌ను సంప్రదిస్తూ మత్స్యకారుల సమాచారం తెలుసుకుంటోంది. మత్స్యకారులపై బంగ్లాదేశ్‌లో చార్జిషీటు దాఖలు కాగా ఢాకాలోని భారత హైకమిషనర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయ బృందం వారికి చట్టపరమైన సహాయాన్ని అందిస్తూ విడుదలకు ప్రయత్నిస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మత్స్యకారులను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌తో గురువారం మాట్లాడారు. మత్స్యకారులను క్షేమంగా తీసుకువచ్చేలా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా జైశంకర్ ఆయనకు తెలియజేశారు. అలానే బంగ్లాదేశ్‌లో ఉన్న ఇండియా మిషన్, కోస్ట్‌గార్డ్‌లతో నిరంతరం ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. బంగ్లాదేశ్‌లోని మోంగ్లా పోలీసు స్టేషన్‌లో మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని, వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని గురువారం ఒక ప్రకటనలో వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఎపీఎన్‌ఆర్టీ సొసైటీ ద్వారా బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు.. విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్డీవో డి.కీర్తి గురువారం విశాఖ వెళ్లి మత్స్యకారుల కుటుంబాలకు ఽఽధైర్యం చెప్పారు. ఆయా కుటుంబాలను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు కూడా పరామర్శించారు.