Minister Payyaavula keshav: అప్పులపై చర్చకు సిద్ధం
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:55 AM
శాసనమండలిలో మంగళవారం ప్రభుత్వం తీసుకున్న రుణాలపై వైసీపీ సభ్యులు మాట్లాడుతూ.. 15నెలల్లో రూ.2.09లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు.
15 నెలల్లో 35,305 కోట్ల అప్పులు తెచ్చాం: కేశవ్
అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో మంగళవారం ప్రభుత్వం తీసుకున్న రుణాలపై వైసీపీ సభ్యులు మాట్లాడుతూ.. 15నెలల్లో రూ.2.09లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. దీనికి ఆర్థికమంత్రి పయ్యావుల కేవశ్ సమాధానం చెబుతూ.. వాళ్ల పత్రికలో రాసిన లెక్కలకు సమాధానం చెప్పమంటే కుదరదన్నారు. 15 నెలల్లో 79,226కోట్ల రుణాలకు ప్రతిపాదించగా, 35,305కోట్లు మాత్రమే తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ రుణాలపై చర్చించడానికి తాము సిద్ధమని, గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపైనా చర్చించాలని అన్నారు. కాగా, రాజకీయ నేతల ప్రోత్సాహం, అధికార పార్టీ ఒత్తిళ్లతో పెట్టే అక్రమ కేసుల వల్ల చాలామంది అన్యాయంగా జైళ్లలో మగ్గిపోతున్నారని, అలాంటివారి కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో న్యాయం చేయాలని జనసేన సభ్యుడు కొణిదెల నాగేంద్రరావు(నాగబాబు) సభలో కోరారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి హోంమంత్రి అనిత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
ఆబ్కారీ సవరణ బిల్లుకు ఆమోదం
మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టిన ఆబ్కారీ శాఖ సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ముస్లింయువతకు ఆర్థిక సహాయంపై వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి ఫరూక్ సమాధానం ఇస్తూ, 2024-25, 2025-26 సంవత్సరాలకు రూ.173.5కోట్ల చొప్పున కేటాయించామని, నిధులు విడుదల కాగానే 19,790మందికి ప్రయోజనం కల్పిస్తామని చెప్పారు.