Share News

AP Government: విద్యుత్‌ ప్రాజెక్టులకు అసైన్డ్‌ భూములు

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:18 AM

పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు అసైన్డ్‌ భూములను కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

AP Government: విద్యుత్‌ ప్రాజెక్టులకు అసైన్డ్‌ భూములు

  • ఆర్డినెన్స్‌ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్మోతి): పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులకు అసైన్డ్‌ భూములను కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఇప్పటిదాకా చట్టపరంగా ఉన్న అడ్డంకులు తొలగిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల (బదిలీ నిషేధం-1979) (చట్టసవరణ) ఆర్డినెన్స్‌-2025ను ప్రభుత్వం జారీచేసింది. ఈ మేరకు గెజిట్‌ విడదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి. ప్రతిభాదేవి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పుడున్న చట్ట నిబంధనల ప్రకారం వాణిజ్య, వ్యాపార అవసరాల కోసం అసైన్డ్‌ భూములను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు కేటాయించడానికి వీల్లేదు. పేదల జీవనోపాధికి, వారి ఆర్ధికాభివృద్ధి కోసం కేటాయించిన భూములను ఇతరులకు అమ్ముకోవడానికి, అలాగే, ప్రభుత్వం ప్రైవేటు అవసరాల పేరిట తీసుకోవడానికి వీల్లేకుండా నిషేధం అమల్లో ఉంది. అందుకే ఈ చట్టాన్ని బదలాయింపు నిషేధ చట్టం (పీవోటీ)గా పిలుస్తారు. పేదల భూములకు ఇదే రక్షణ కవచం. అయితే, కొన్నిరకాల ప్రభుత్వ అవసరాలకోసం రైతులకు నిర్దేశిత ధర చెల్లించి అసైన్డ్‌ భూములు సేకరించే వెసులుబాటును ప్రభుత్వానికి కల్పిస్తోంది ఈ చట్టం. కానీ ప్రభుత్వ కార్పొరేషన్లు, వాటి ద్వారా ప్రైవేటు సంస్థలు, కంపెనీలకు ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. ఈ అడ్డంకులను జగన్‌ సర్కారు 2020లో తొలగించగా, ఇప్పుడు కూటమి సర్కారు మరో ముందడుగు వేసింది. అసైన్డ్‌ భూముల చట్టంలో కొత్త సెక్షన్లను జోడించి రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు పీవోటీ నుంచి మినహాయింపులు ఇస్తూ మంత్రివర్గం ఇటీవల ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. దానికి గత నెల 28నే గవర్నర్‌ ఆమోదం లభించింది. దీంతో ఆర్డినెన్స్‌పై గెజిట్‌ విడుదల చేస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.


నాడు ఆ సర్కారు.. నేడు ఈ ప్రభుత్వం

విద్యుత్‌ ప్రాజెక్టులకు అసైన్డ్‌ భూములు ఇచ్చే విధానానికి తొలుత జగన్‌ సర్కారే శ్రీకారం చుట్టింది. సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు అసైన్డ్‌ భూములు ఇచ్చేందుకు గాను 2020 డిసెంబరు 24న తొలిసారిగా ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం-1977లో సవరణ చేసింది. సెక్షన్‌ 2, 3లను సవరించి, ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు అసైన్డ్‌ భూములు కేటాయించవచ్చని నిషేఽధ మినహాయింపులు ఇచ్చింది, దీంతో వేల ఎకరాల అసైన్డ్‌ భూములను తొలుత గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు కేటాయించి, ఆ సంస్థ ద్వారా ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు, సంస్థలకు కేటాయిచింది. కాగా.. నేడు సోలార్‌కే కాదు, పవన విద్యుత్‌ ఉత్పత్తి (విండ్‌ పవర్‌) ప్రాజెక్టులకు కూడా అసైన్డ్‌ భూములివ్వాలని కూటమి సర్కారు నిర్ణయించింది. దీర్ఘకాలిక ప్రాతిపకదిన ఈ రెండు కేటగిరీల ప్రాజెక్టులకు అసైన్డ్‌ భూములు కేటాయించాలని అసైన్డ్‌ భూముల చట్టంలో సెక్షన్‌ 2ను సవరించింది. జగన్‌ సర్కారు సెక్షన్‌ 2 ద్వారా ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (ఏపీజీఈసీఎల్‌)కు భూములివ్వాలని పీవోటీ మినహాయింపులు ఇస్తూ చట్టసవణ చేసింది. అయితే, కూటమి సర్కారు ఆ సంస్థ పేరును తీసేసి కొత్తగా ఏపీ గ్రామీణ వ్యవసాయ విద్యుత్‌ లిమిటెడ్‌, నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ)లను చేర్చింది. సెక్షన్‌ 2(ఏ)లోనూ ఆ రెండింటి పేర్లను పేర్కొని వాటికి పీవోటీ నిబంధనలు వర్తించవని తెలిపింది.

Updated Date - Dec 02 , 2025 | 05:19 AM