PM Modi AP Visit: ఆంధ్ర వైభవం
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:03 AM
ఆంధ్రప్రదేశ్ సామర్థ్యం, అభివృద్ధిలో వేగంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. దేశ ప్రగతిలో రాష్ట్ర పాత్ర గురించి తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఏపీ పర్యటనలో భాగంగా తొలుత శ్రీశైలం చేరుకున్న ప్రధాని...
రాష్ట్రాన్ని కొనియాడుతూ ప్రధాని ప్రసంగం.. మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం
శ్రీశైల మల్లన్న దర్శనంపై ఆనందం.. గుడి అరుగుపైనే బాబు, పవన్‌తో మాటామంతీ
కర్నూలు సభకు వెల్లువలా జనం.. రాష్ట్ర ప్రగతి, ప్రాజెక్టులపై మోదీ ఫోకస్
(కర్నూలు/అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ సామర్థ్యం, అభివృద్ధిలో వేగంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. దేశ ప్రగతిలో రాష్ట్ర పాత్ర గురించి తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఏపీ పర్యటనలో భాగంగా తొలుత శ్రీశైలం చేరుకున్న ప్రధాని అక్కడ సుమారు గంటపాటు గడిపారు భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన వెంట చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రమే ఉన్నారు. పూజల అనంతరం కొద్దిసేపు ఆలయ ఆవరణలోనే మోదీ ధ్యానముద్రలో గడిపారు. అనంతరం శ్రీశైలంలోపి ఛత్రపతి శివాజీ మహరాజ్ స్మారక స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు.
కూటమి నేతల్లో ఆనందం
ఉదయం 10 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని శ్రీశైల క్షేత్ర సందర్శన, నన్నూరులో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం సాయంత్రం 4.45కి ఢిల్లీ తిరుగు ప్రయాణమయ్యారు. కర్నూలులో నిర్వహించిన జీఎస్టీ సభ విజయవంతం కావడంతో కూటమి నేతల్లో ఆనందం నెలకొంది. కేవలం జీఎస్టీ సభలా కాకుండా రాయలసీమ అభివృద్ధికి వేదికగా సభ నిర్వహణ సాగిందని నేతలు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సైతం ఎక్స్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. అక్టోబరు 16 ఏపీ ప్రజలకు రెట్టింపు ఆనందాన్ని అందించిందని ఆయన పేర్కొన్నారు.
విమానాశ్రయంలో ఘన స్వాగతం
గురువారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రధానికి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివా్‌సవర్మ, రాష్ట్ర మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ గుప్త, డీఐజీ కోయ ప్రవీణ్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ముకేశ్ కుమార్ మీనా, ప్రధానమంత్రి పర్యటన వ్యవహారాల ప్రత్యేక అధికారి వీరపాండియన్, రాజమండ్రి, మచిలీపట్నం, కర్నూలు, నంద్యాల ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, వల్లభనేని బాలశౌరి, నాగరాజు, శబరి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
అరుగుపై ముచ్చట్లు...
శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో అరుగుపై మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పది నిమిషాలపాటు ముచ్చటించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మోదీ చర్చించినట్లు సమాచారం. అమరావతి, పోలవరం పనులు ఎలా సాగుతున్నాయని ఆరా తీశారు. ఈ రెండు అంశాల్లో ఎలాంటి సాయం చేయడానికైనా కేంద్రం సిద్ధంగా ఉంటుందని ఇద్దరు నేతలకు ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. అలాగే... శ్రీశైల సందర్శనపైనా ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయ పరిసరాల్లోనే తాను పుట్టానని, చిన్ననాటి నుంచి సోమనాథుడిని చూస్తూ పెరిగానని, ఇప్పుడు శ్రీశైలం రావడం తన అదృష్టమని ప్రధాని పేర్కొన్నట్లు సమాచారం.

ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు
కర్నూలు నగరంలో పీఎస్-3 వద్ద పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం అదనపు వపర్ గ్రిడ్‌కు రూ.2,886 కోట్లతో శ్రీకారం
రూ.4,922 కోట్లతో కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్, కడప జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి.
పెందుర్తి-సింహాచలం నార్త్ మధ్య రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.184 కోట్లతో శంకుస్థాపన.
కొత్తవలస- విజయనగరం మధ్య రూ.493 కోట్లతో చేపట్టే నాలుగో రైల్వే లైన్.
విశాఖలో సబ్బవరం-షీలానగర్ మధ్య రూ.964 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణం.
మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులు
రూ.82 కోట్లతో నిర్మించిన రేణికుంట-కపడ-మదనపల్లె రోడ్డు ప్రారంభోత్సవం
రూ.286 కోట్లతో నిర్మించిన కడప-నెల్లూరు-చునియాంపల్లి రోడ్డు ప్రారంభం
గుడివాడ-నూజెండ్ల మధ్య రూ.98 కోట్లతో నిర్మించిన నాలుగు వరుసల రోడ్డు, ఫ్లైఓవర్ ప్రారంభం
కళ్యాణదుర్గం-రాయదుర్గం-మొలకలమూరు మధ్య రూ.13 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారి ప్రారంభోత్సవం.
రూ.593 కోట్లతో నిర్మించిన పీలేరు-కలసూరు నాలుగు వరుసల నేషనల్ హైవే ప్రారంభం
రూ.362కోట్లతో కృష్ణాజిల్లా నిమ్మలూరులోని బీఈఎల్‌లో రక్షణ శాఖ చేపట్టిన అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ గ్లాసుల ఉత్పత్తి కేంద్రం.
చిత్తూరు జిల్లాలో ఇండేన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.200 కోట్లతో చేపట్టిన బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభోత్సవం.
జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు
రూ.546 కోట్లతో పూర్తి చేసిన కొత్తవలస-కోరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులు.
1,730 కోట్లతో శ్రీకాకుళం జిల్లాలో పూర్తి చేసిన శ్రీకాకుళం-అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్.