Share News

Centre Cuts Labour Allocation Under MGNREGA: ఉపాధి పనిదినాల్లో కోత!

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:23 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పనిదినాల సంఖ్యను తగ్గిస్తోంది. గతేడాది మన రాష్ట్రానికి 24 కోట్ల పనిదినాలను మంజూరు చేయగా..

Centre Cuts Labour Allocation Under MGNREGA: ఉపాధి పనిదినాల్లో కోత!

  • ఈ ఏడాది 18 కోట్లకు పరిమితం చేసిన కేంద్రం.. గత ఏడాది 24 కోట్ల పనిదినాలు మంజూరు

  • మెటీరియల్‌ నిధులు కూడా తగ్గే అవకాశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పనిదినాల సంఖ్యను తగ్గిస్తోంది. గతేడాది మన రాష్ట్రానికి 24 కోట్ల పనిదినాలను మంజూరు చేయగా.. ఈ ఏడాది మొత్తంగా 18 కోట్ల పనిదినాలు మాత్రమే మంజూ రు చేసింది. మొద టి విడతలో కేటాయించిన 15 కోట్ల పనిదినాలు నెల కిందటే పూర్తయ్యాయి. దీంతో మరో 9 కోట్ల పనిదినాలు మంజూరు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం ఈ ఏడాది నుంచి దేశవ్యాప్తంగా పనిదినాల సంఖ్యను తగ్గించాలన్న యోచనతో మన రాష్ట్రానికి 3 కోట్ల పనిదినాలు మాత్రమే మంజూరు చేశారు. తెలంగాణకు గతంలో 6 కోట్ల పనిదినాలు కల్పించగా, తాజాగా ఒక కోటి పనిదినాలు మాత్రమే అదనంగా మంజూరు చేశారు. కాగా, ఇతర రాష్ట్రాల కంటే కొంత మెరుగ్గానే మన రాష్ట్రానికి పనిదినాలు మంజూరయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు అయింది. ప్రతి ఏటా పనిదినాలను పెంచడం ద్వారా చాలా రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది.

ఐదేళ్లతో పోలిస్తే తగ్గిన లేబర్‌ బడ్జెట్‌

గత ఐదేళ్లతో పోలిస్తే కేంద్రం రాష్ట్రానికి కేటాయించే లేబర్‌ బడ్జెట్‌ (పని దినాల సంఖ్య) ఈ ఏడాది తగ్గింది. 2021-22, 2022-23ల్లో 24 కోట్లు, 2023-24లో 25.54 కోట్లు, 2024-25లో 24.22 కోట్లు లేబర్‌ బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది. 18 కోట్ల పనిదినాలకు తగ్గించారు. అంటే 25 శాతం లేబర్‌ బడ్జెట్‌ తగ్గించినట్లయింది. మెటీరియల్‌ నిధుల కేటాయింపులూ 25 శాతం తగ్గే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, అదనపు పనిదినాలు సాధిస్తామని అధికారులు చెప్తున్నారు.

మెటీరియల్‌ పనులూ తగ్గుముఖం

ఉపాధి హామీ పథకంలో కూలీలు పనులు చేయడం ద్వారా ఖర్చు చేసే మొత్తానికి అనుగుణంగా కేంద్రం మెటీరియల్‌ నిధులను రాష్ట్రాలకు మంజూరు చేస్తుంది. లేబర్‌ బడ్జెట్‌, మెటీరియల్‌ నిధులను 60:40 నిష్పత్తిలో కేటాయిస్తుంది. దీంతో 25 కోట్ల మేర పనిదినాలను ప్రతి ఏటా వినియోగిస్తున్న క్రమంలో రాష్ట్రానికి ఏటా రూ.3 వేల నుంచి రూ.4 వేల కోట్ల దాకా మెటీరియల్‌ నిధులు అందేవి. లేబర్‌ బడ్జెట్‌ కేటాయింపు తగ్గుదలకు అనుగుణంగా మెటీరియల్‌ నిధులూ తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

Updated Date - Nov 19 , 2025 | 05:23 AM