Surging Revenue Deficit: పోటెత్తుతున్న లోటు!
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:33 AM
2025 26 ఆర్థిక సంవత్సరంలో రూ.33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. కానీ, ఏప్రిల్- సెప్టెంబరు నాటికే ఇది రూ.46,652 కోట్లకు చేరింది. అంటే 140 శాతం పెరిగింది....
ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి!
కట్టలు తెంచుకుంటున్న రెవెన్యూ లోటు
2025-26లో 33,185 కోట్లుంటుందని అంచనా
ఆరు నెలలకే రూ.46,652 కోట్లకు చేరిన వైనం
అంచనాలకు తగినట్లు పెరగని రాబడులు
అంతకంతకూ పెరుగుతున్న రెవెన్యూ వ్యయం
తొలి 6 నెలల్లో రూ.63,052 కోట్ల అప్పు
అనవసర వ్యయాలను తగ్గించుకోవాల్సిందే!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. కానీ, ఏప్రిల్- సెప్టెంబరు నాటికే ఇది రూ.46,652 కోట్లకు చేరింది. అంటే 140 శాతం పెరిగింది. రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ ఖర్చులు ఎక్కువైతే అదే... రెవెన్యూలోటు! రెవెన్యూ రాబడి అంటే... అప్పులను మినహాయించగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలిపి రెవెన్యూ రాబడి అవుతుంది. సొంతపన్నుల్లో జీఎస్టీ వసూళ్లు, స్టాంపులు, రిజిస్ర్టేషన్ల ఆదాయం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు, కేంద్రపన్నుల్లో వాటాలు, ఇతర పన్నులు-సుంకాల ద్వారా వచ్చే ఆదాయం ఇందలో ఉంటుంది. రెవెన్యూ ఖర్చు అంటే... అభివృద్ధి పనులు, తిరిగి ప్రతిఫలాన్ని ఇచ్చే పద్దులపై పెట్టే ఖర్చులను మినహాయించగా పెట్టే ఇతర వ్యయం! జీతాలు, పింఛన్లు, రాయితీలు, వడ్డీల చెల్లింపులతో పాటు ప్రభుత్వ నిర్వహణ, ఇతర ప్రభుత్వ పథకాలకు వెచ్చించే మొత్తాలను రెవెన్యూ ఖర్చులుగా లెక్కిస్తారు. వీటిపై పెట్టిన ఖర్చులో పైసా తిరిగిరాదు. లోటును హద్దుల్లో ఉంచడమే అసలైన ఆర్థిక నిర్వహణ.
అంతకంతకూ పెరుగుతూ...
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెవెన్యూ లోటును తగ్గిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. బడ్జెట్ అంచనాల్లో కూడా రెవెన్యూ లోటును చాలా తక్కువగా చూపిస్తోంది. కానీ... అసలు వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- సెప్టెంబరు నాటికే రెవెన్యూ లోటు రూ.46,652 కోట్లకు చేరింది. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడం, రెవెన్యూ వ్యయాలను పరిమితం చేయలేకపోవడంతో ‘లోటు’ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రెవెన్యూ రాబడులు మరీ తగ్గిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు పెరుగుతున్న ట్రెండ్ ప్రతి నెలా కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు... అంటే ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.17,686 కోట్లకు చేరినట్టు ‘కాగ్’ తన నెలవారీ నివేదికల ద్వారా వెల్లడించింది. ఆ సమయంలో రెవెన్యూ రాబడి రూ.21,707 కోట్లు ఉండగా, రెవెన్యూ ఖర్చులు రూ.39,393 కోట్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద రెవెన్యూ లోటును రూ.33,185 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ... కేవలం రెండు నెలల్లోనే అది 53 శాతానికి చేరింది. ఆరు నెలలకు140 శాతానికి చేరుకుంది. ఈ ఆరు నెలల్లో రెవెన్యూ రాబడి రూ.74,234 కోట్లు వచ్చింది. అదే సమయంలో, రెవెన్యూ ఖర్చు రూ.1,20,887 కోట్లకు చేరింది. బడ్జెట్‌లో అంచనా వేసిన ఆదాయంలో వచ్చింది 34 శాతమే కాగా... లోటు మాత్రం అంచనాలకు మించి, 140 శాతానికి చేరింది. ఈ ఆరు నెలల్లో ద్రవ్యలోటు 78 శాతానికి చేరింది. బడ్జెట్‌లో ఏడాదికి గాను రూ.79,926 కోట్లు అంచనా వేయగా సెప్టెంబరు నాటికే అది రూ.62,213 కోట్లకు చేరుకుంది. బడ్జెట్‌లో ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు రూ.57,477 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఆరునెలల్లో... రూ.24,821 కోట్లు వచ్చాయి. అంటే... 43 శాతం! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,97,929 కోట్ల ఆదాయం అంచనా వేశారు. సెప్టెంబరు నాటికి రూ.1,37,319 కోట్లు వచ్చాయి. ఇందులో అప్పులు రూ.63,052 కోట్లు ఉన్నట్టు కాగ్ నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో 11,715 కోట్లు మూలధన వ్యయం చేసినట్టు పేర్కొంది.
ఏం చేయాలి
రెవెన్యూ ఖర్చుల్లో జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, పింఛన్ల వాటానే అత్యధికం! వీటిలో ఏది తగ్గించాలో తెలియని పరిస్థితి. సొంత ఆదాయ మార్గాలు పెంచుకుంటూ... పథకాలకు అనర్హులను ఏరివేయడం, అవసరంలేని పథకాలకు కోతలు వేయడం ద్వారా రెవెన్యూ లోటు కాస్తయినా కట్టడి చేయవచ్చు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం రెవెన్యూ లోటు ‘సున్నా’ ఉండాలి. అందుకు అనుగుణంగా కేంద్రం గ్రాంట్లు మంజూరు చేస్తుంది. మూలధన వ్యయం కోసం గరిష్ఠంగా 3శాతం వరకు అప్పులకు అనుమతిస్తుంది. రెవెన్యూ లోటు ఆ మేరకు ఉండొచ్చు. కానీ... అన్ని హద్దులు దాటడం ఆందోళన కలిగిస్తోంది. అనవసర ఖర్చులతో లోటు పెరగడంతోపాటు అప్పుల భారం పెరుగుతుంది. అప్పులకు వడ్డీ చెల్లింపులతో రెవెన్యూ వ్యయం పెరుగుతుంది. ఇదో విషవలయం.. ఇందులో కూరుకుపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవడం ఖాయం.