Share News

Cyclone Alert: వీడని వాన.. తప్పిన వాయుగండం

ABN , Publish Date - Oct 24 , 2025 | 03:10 AM

రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో రెండు రోజులుగా కొనసాగిన తీవ్ర అల్పపీడనం బుధవారం రాత్రి అల్పపీడనంగా బలహీనపడి దక్షిణ కోస్తాలో తీరం దాటింది.

Cyclone Alert: వీడని వాన.. తప్పిన వాయుగండం

చీరాల ప్రాంతంలో నివాసాల్లోకి వర్షం నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఉదయం వరకు అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, కోస్తాలో కాకినాడ నుంచి పల్నాడు వరకు, రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో శుక్ర, శని, ఆదివారాలు భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, శుక్రవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. జిల్లాల్లో పరిస్థితులను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌ విశ్వనాథన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సహాయక చర్యల కోసం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.


  • దక్షిణ కోస్తాలో తీరం దాటిన అల్పపీడనం

  • రాష్ట్రంలో విస్తారంగా వానలు

  • నెల్లూరు జిల్లాలో వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి

  • నేడు మరో అల్పపీడనం.. వాయుగుండంగా మారే చాన్స్‌

  • 29 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు: ఐఎండీ

  • ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్‌ రూముల ఏర్పాటు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో రెండు రోజులుగా కొనసాగిన తీవ్ర అల్పపీడనం బుధవారం రాత్రి అల్పపీడనంగా బలహీనపడి దక్షిణ కోస్తాలో తీరం దాటింది. అనంతరం ఇది కర్ణాటక పరిసరాల్లో కొనసాగుతూ శుక్రవారం నాటికి అరేబియా సముద్రంలోకి ప్రవేశించనుంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు రాష్ట్రంపైకి రావడంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ముసురుపట్టి, విస్తారంగా వర్షాలు కురిశాయి. గురువారం కోనసీమ, పశ్చిమగోదావరి, నెల్లూరు, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన పడింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 12, రావులపాలెంలో 9.2, ముమ్మిడివరంలో 9, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 8.5, కోనసీమ జిల్లా గంగవరంలో 8.3, ముక్కామలలో 7.9, నెల్లూరు జిల్లా రావూరు, కండలేరు, ఏలూరు జిల్లా కలిదిండిలలో 7.8, కోనసీమ జిల్లా మలికిపురంలో 7.6, కాకినాడ జిల్లా కోటనందూరులో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున(45) గురువారం బ్రాహ్మణక్రాక-బోగోలు ఆర్‌అండ్‌బీ రోడ్డు చప్టా దాటుతూ నేరేళ్లవాగు ప్రవాహంలో బైక్‌తో సహా కొట్టుకుపోయి మరణించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. కూడేరు మండలం కలగళ్లలో పిడుగుపాటుకు గాలిమర దగ్ధమైంది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోనూ వాగులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.


మంత్రుల పర్యవేక్షణ

జిల్లాల్లో పరిస్థితులపై మంత్రులు పర్యవేక్షణ చేస్తున్నారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, స్పెషల్‌ సీఎస్‌ జయలక్ష్మీ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇంకో నాలుగైదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించారు. మండలాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి రెవెన్యూ, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌ అధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. పంట ఉత్పత్తులను వీలైనంత వరకు సురక్షిత ప్రాంతాల్లో భద్రపర్చుకోవాలన్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

నేడు అల్పపీడనం

కోస్తాకు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడంది. దీని ప్రభావంతో శుక్రవారం ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈనెల 25, 26 నాటికి వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈనెల 27వ తేదీ తర్వాత ఉత్తరకోస్తా వైపు రానుందని అంచనా వేస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.

Updated Date - Oct 24 , 2025 | 03:11 AM