Minister Lokesh: భారత్‌లో పెట్టుబడులకుఆంధ్రా గేట్‌వే!
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:08 AM
భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్‌వేగా మారిందని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ తెలిపారు...
16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు
1.36 లక్షల కోట్లతో గూగుల్ డేటా సెంటర్
1.35 లక్షల కోట్లతో ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్
పారిశ్రామికవేత్తలకు సులభతర విధానాలు
భాగస్వామ్య సదస్సుకు వచ్చి తెలుసుకోండి
ఆస్ట్రేలియాతో వాణిజ్యంలో ఏపీ కీలక పాత్ర
ఇంజనీరింగ్, వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల్లో మాదే ప్రముఖ స్థానం
పెట్రోలియం, ఔషధాల్లో కూడా..
బ్రిస్బేన్ రౌండ్ టేబుల్‌లో మంత్రి లోకేశ్ వెల్లడి
వివిధ వర్సిటీలు, సంస్థల అధినేతలతో వరుస సమావేశాలు
అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్‌వేగా మారిందని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ తెలిపారు. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తోందన్నారు. ఫలితంగా గత 16 నెలల కాలంలో రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన బ్రిస్బేన్‌లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత కాన్సులేట్ జనరల్ (బ్రిస్బేన్) నీతూ భగోతియా, ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. లోకేశ్ మాట్లాడుతూ.. ఇటీవల గూగుల్ సంస్థ విశాఖలో రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద పెట్టుబడిగా అభివర్ణించారు. ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్లతో అనకాపల్లి సమీపంలో దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్ నిర్మించబోతోందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం సులభతర విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు హాజరై ఆయా విధానాలను స్వయంగా తెలుసుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందన్నారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతుల్లో శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ పరికరాలు, వ్యవసాయోత్పత్తులు ఉన్నాయని.. వాటిలో రాష్ట్రం ప్రముఖ స్థానం వహిస్తోందని వివరించారు. 2022 డిసెంబరులో అమల్లోకి వచ్చిన ఆస్ట్రేలియా-భారత్ ఆర్థిక సహకారం-వాణిజ్య ఒప్పందం.. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు గేమ్ చేంజర్‌గా మారిదన్నారు. 2020-21లో ద్వైపాక్షిక వస్తు, వాణిజ్యం 12.2 బిలియన్ డాలర్లు కాగా.. 2024-25 నాటికి దాదాపు రెట్టింపై 24.10 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు.
రాష్ట్రంలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ పెట్టండి
లోకేశ్ బుధవారం కూడా పలు యూనివర్సిటీలు, సంస్థల అధినేతలను కలిశారు. గ్రిఫిత్ యూనివర్సిటీ ఇండియా సెంటర్‌ను ఏపీలో నెలకొల్పాలని కోరారు. బ్రిస్బేన్‌లో గ్రిఫిత్ వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్) మార్నీ వాట్సన్‌తో సమావేశమయ్యారు. 1975లో దీనిని స్థాపించామని.. ప్రపంచ అగ్రశ్రేణి విద్యాలయాల్లో ఒకటిగా ఉందని.. సామాజిక న్యాయం, స్థిరత్వం, ఆవిష్కరణ రంగంలో పేరుగాంచిందని ఆమె తెలిపారు. పబ్లిక్ పాలసీ, సుస్థిరత, నూతన ఆవిష్కరణల రంగాల్లో తమ రాష్ట్ర యూనివర్సిటీలతో కలసి ఉమ్మడి కార్యక్రమాలను లోకేశ్ ఈ సందర్భంగా కోరారు. పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహనా కార్యక్రమాల్లో కలసి పనిచేద్దామని సూచించారు. ఇందుకోసం గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ లేదా హబ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. సిలబస్ రూపకల్పన, నైపుణ్య ధ్రువీకరణల్లో గ్లోబల్ అకడమిక్ ప్రమాణాల కోసం రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థతో భాగస్వామ్యానికి ప్రతిపాదించారు. ‘పునరుత్పాదక ఇంధనం, వాతావరణ స్థితిస్థాపకత, ప్రజారోగ్యం, నీటి యాజమాన్య నిర్వహణ రంగాల్లో ఉమ్మడిగా పరిశోధనలు చేద్దాం. ప్రముఖ విద్యా సంస్థల మధ్య డ్యూయల్ డిగ్రీ లేదా ట్విన్నింగ్ ప్రోగ్రాములు చేద్దాం. ఎన్‌ఆర్‌ఎం-ఏపీ, విట్-ఏపీ, ఏయూ అధ్యాపకులు, విద్యార్థుల అభివృద్ధికి ఎక్స్ఛేంజీ కార్యక్రమాలను ప్రోత్సహించాలి. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే గ్లోబల్ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు హాజరవ్వండి’ అని వాట్సన్‌ను ఆహ్వానించారు.
రాష్ట్రంలో హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు
భారత్‌లో విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని లోకేశ్ తెలిపారు. విద్యారంగంపై క్వీన్స్‌ల్యాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ సెంటర్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతర్జాతీయగా అధునాతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలో హైస్కూలు స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఏఐ ల్యాబ్‌లు, రోబోటిక్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

జేమ్స్ కుక్ వర్సిటీ ప్రొఫెసర్‌తో భేటీ
ఏపీలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి సహకరించాలని జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వాల్ జెంజర్‌ను లోకేశ్ కోరారు. రొయ్యలు, చేపల పెంపకం సామర్థ్యాన్ని పెంచేందుకు సీఎ్‌సటీఎ్‌ఫఏ ద్వారా ఆక్వాకల్చర్ జెనెటిక్స్ నైపుణ్యాలను అందించాలని కోరారు. బ్లాక్ టైగర్ రొయ్యలతో భారత్‌లో ప్రధానంగా ఉత్పత్తి చేసే ఆక్వా రకాల్లో వ్యాధి నిరోధిక, వృద్ధిరేటు కోసం జన్యుపరమైన మెరుగుదలకు కృషి చేయాలని..వాటర్ రీసైక్లింగ్, ఫీడ్ ఆప్టిమైజేషన్‌ను ప్రోత్సహించాలని.. రాష్ట్ర ఆక్వా రైతుల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా డిజైన్లు ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా డిజైన్లు ఇవ్వాలనిపాపులస్ సంస్థకు లోకేశ్ విజ్ఞప్తి చేశారు. బ్రిస్బేన్‌లో ఆ సంస్థ సీనియర్ ప్రధాన ఆర్కిటెక్ట్ ’సీన్ గాలఘెర్, ఆసియా-ఫసిఫిక్ బిజినెస్ డెవల్‌పమెంట్, బిడ్స్ అండ్ కమ్యూనికేషన్ హెడ్ ఎలిజబిత్ డిసిల్వాలతో ఆయన సమావేశమయ్యారు. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన స్టేడియాలకు ఈ సంస్థ వినూత్నమైన డిజైన్లు అందిస్తోంది. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా స్టేడియాల నిర్మాణానికి సహకారం అందించాలని పాపుల్‌సను లోకేశ్ కోరారు.