Share News

AP Education: ఏపీలో విద్యావిధానం భేష్‌

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:53 AM

ఆంధ్రప్రదేశ్‌లో ‘జాతీయ విద్యావిధానం-2020’కి అనుగుణంగా మాతృభాష ఆధారంగా వివిధ భాషలను నేర్చుకోవడంపై వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయని యునెస్కో తెలిపింది.

AP Education: ఏపీలో విద్యావిధానం భేష్‌

  • మాతృభాష ఆధారంగా విద్యార్థులకు బహు భాషల్లో పాఠ్యాంశాల బోధన

  • కోయ, కువి, జాతాపు, ఆదివాసీ సహా పలు భాషలపై అందుబాటులో పుస్తకాలు

  • ఆదివాసీ చిన్నారుల హాజరు అత్యధికం

  • ప్రశంసించిన యునెస్కో విద్యా నివేదిక

  • ‘స్టేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌-2025’ విడుదల

న్యూఢిల్లీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ‘జాతీయ విద్యావిధానం-2020’కి అనుగుణంగా మాతృభాష ఆధారంగా వివిధ భాషలను నేర్చుకోవడంపై వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయని యునెస్కో తెలిపింది. ‘భాషా విషయాలు’ శీర్షికతో మాతృభాష సహా బహుభాషల్లో విద్యపై యునెస్కో బుధవారం ‘స్టేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌-2025’ నివేదికను విడుదల చేసింది. ఆదివాసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఏపీలో మాతృభాష ఆధారిత బహుభాషల విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆదివాసీ భాషల్లో కూడా చిన్న చిన్న పుస్తకాలు, పాఠ్యప్రణాళికలను రూపొందించారని యునెస్కో ప్రశంసించింది. ఏపీలో లిపి-భాష మధ్య సంబంధాలు, డిజిటల్‌ సంసిద్ధత అత్యధికస్థాయిలో ఉందని తెలిపింది. డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, బహు భాషలతో కూడిన పుస్తకాలు ఉన్న గ్రంథాలయాలు, అనువాద సౌలభ్యాల వల్ల కొత్త మార్గాలు ఏర్పరిచారని పేర్కొంది. రాష్ట్రస్థాయి విద్య, పరిశోధన, శిక్షణ(ఎ్‌సఈఆర్‌టీ)లు, చదువరులకు లక్షిత సూచనలు(టీఆర్‌ఐ)లు, యూనివర్సిటీలు, ఎన్‌ జీవోలు, సాంస్కృతిక సంస్థలు, సాంకేతిక బృందాల మఽధ్య బలమైన భాగస్వామ్యాలు ఉన్నాయని నివేదిక వివరించింది. ఆదివాసీల భాషలు, సంప్రదాయాలు, భాష, సంస్కృతి, పర్యావరణం, అనుభవం ద్వారా నేర్చుకోవడం మొదలైన వాటిని అనుసంధానం చేయడం ద్వారా బలమైన పునాది ఏర్పడుతోందని తెలిపింది. ఏపీలో ఎన్‌సీఆర్‌టీ, సీఐఐఎల్‌తో పాటు రాష్ట్ర సంస్థల తోడ్పాటుతో ప్రయోగాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొంది.


బహుభాషల్లో బోధన ను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలను ఏపీలో బాగా నిర్వహిస్తున్నారని యునెస్కో నివేదిక తెలిపింది. రాష్ట్రంలో ఆదివాసీ విద్యార్థుల నమోదు శాతం అత్యధికంగా ఉందని, ప్రాథమిక స్థాయిలో ఇది 118.5 శాతం కాగా, సెకండరీ స్థాయిలో 96.6 శాతం, హయ్యర్‌ సెకండరీలో 69 శాతంగా నమోదైనట్టు పేర్కొంది. కథల ద్వారా ఆదివాసీ పాఠశాలల్లో విద్యాబోధన సమర్థవంతంగా జరుగుతోందని తెలిపింది. కోయ, కువి, జాతాపు, సవర, ఆదివాసీ, ఒడియా, కొండ దొర భాషల్లో చిన్న చిన్న పుస్తకాలను రూపొందించారని ప్రశంసించింది. అదేవిధంగా సాల్ట్‌(సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌) సంస్కరణల ద్వారా అధ్యాపకులకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలు అమలవున్నాయని తెలిపింది, బహుభాషల్లో ఈ-పుస్తకాలు, క్యూఆర్‌ కోడ్‌తో అనుసంధానమైన ఆడియో, వీడియో పాఠాలు, కమ్యూనిటీ రేడియో ద్వారా ఆదివాసీ ప్రాంతాల్లో మాతృభాష సహా బహుభాషల్లో బోధన జరుగుతోందని, దీక్షా పోర్టల్‌ను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారని నివేదిక వివరించింది.

Updated Date - Dec 18 , 2025 | 03:54 AM