Share News

Sports Department: ఆడారు అవినీతి ఆట

ABN , Publish Date - Aug 11 , 2025 | 02:54 AM

వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ సాగించిన భారీ అవినీతి ఆటపై విజిలెన్స్‌ విచారణ ముగిసింది. మొత్తం రూ.40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించినట్లు తెలిసింది.

Sports Department: ఆడారు అవినీతి ఆట

  • ‘ఆడుదాం’లో 40 కోట్లు మింగేశారు!

  • లెక్కల్లో ఖర్చు డబుల్‌.. నాసిరకం కిట్లు

  • వైసీపీ నిర్వాకంపై విజిలెన్స్‌ నిర్ధారణ

  • నేడు ప్రభుత్వానికి 30 పేజీల నివేదిక

  • రోజా, ఆమె సోదరుడి పాత్రపైనా దృష్టి

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ సాగించిన భారీ అవినీతి ఆటపై విజిలెన్స్‌ విచారణ ముగిసింది. మొత్తం రూ.40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. విజిలెన్స్‌ అధికారులు సోమవారం దాదాపు 30 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. వైసీపీ పాలన చివరి ఏడాది రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం రూపొందించారు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యే సరికి ఖర్చు రూ. 100 కోట్లు అయింది. ఇంత స్థాయిలో ఖర్చు ఎందుకు చేయాల్సి వచ్చిందన్న అనుమానాలు అప్పుడే వచ్చాయి. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. అటు ఎలక్షన్‌ స్టంట్‌నూ.. ఇటు ఎలక్షన్‌ ఫండ్‌నూ దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు పెద్దఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో ‘ఆడుదాం ఆంధ్రా’పై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మూడు నెలలపాటు లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పని చేసినవారిని కూడా విచారించారు.


విజేతలంతా వైసీపీ కార్యకర్తలే!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, విజిలెన్స్‌ విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామస్థాయిలో క్రీడలకు రూ.10 వేలు కేటాయించి.. మరో రూ. పది వేలు జేబులో వేసుకుని.. ఖర్చు రూ. 20 వేలు చూపించారు. పలు జిల్లాల్లో ఇలాగే ‘ఆటలు ఆడించారు’. ప్రతిస్థాయిలోనూ కేటాయింపుల కంటే రెండింతల ఖర్చు చేశారు. చివరికి కలెక్టర్లతో కూడా ఈ కార్యక్రమం కోసం అదనంగా నిధులు కేటాయించేలా చేశారు. మరోవైపు 2023 డిసెంబర్‌లో ప్రారంభమైన ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్‌ స్టికర్లను భారీగా అంటించారు. అదేసమయంలో క్రీడాకారులకు నాసికరం కిట్లు సరఫరా చేశారు. విజేతల విషయంలో మరీ అన్యాయంగా వ్యవహరించారు. విజేతలంతా వైసీపీ కార్యకర్తలే. ప్రభుత్వం మారి కొత్త అధికారులు, మంత్రులు బాధ్యతలు తీసుకునే లోపలే వివరాలను డిలీట్‌ చేశారని విజిలెన్స్‌ తన నివేదికలో తెలిపినట్టు తెలిసింది. కాగా, ఈ అవినీతి సాగినకాలంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి మంత్రి రోజా, ఆమె సోదరుడిపై పలువురు క్రీడాకారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వారి పాత్రనూ విజిలెన్స్‌ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం.


చీఫ్‌ ఇంజనీర్‌పై విమర్శలు..

‘ఆడుదాం ఆంధ్రా’ సమయంలో శాప్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా పని చేసిన అధికారి పాత్రపై విమర్శలు వస్తున్నాయి. ఆయన డిఫ్యుటేషన్‌ ఈ నెల ఐదో తేదీతో ముగిసింది. ఆర్‌ అండ్‌ బీ నుంచి వచ్చిన ఆయన కొన్నేళ్లుగా శాప్‌లో చీఫ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. విజిలెన్స్‌ విచారణ జరుగుతున్న సమయంలో ఆయనను చీఫ్‌ ఇంజనీర్‌గా కొనసాగించేందుకు క్రీడాశాఖ అధికారులు సిద్ధం అయ్యారు. తనను మరో ఏడాది చీఫ్‌ ఇంజనీర్‌గా కొనసాగించాలని ఆయన స్పెషల్‌ సీఎస్‌కు విన్నవించారు. ఆయన విన్నపంపై స్పందించిన క్రీడాశాఖ స్పెషల్‌ సీఎస్‌ దీనిపై చర్యలు తీసుకోవాలని శాప్‌కు పంపించారు. ఆయనను మరో ఏడాది కొనసాగించేందుకు అధికారులు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 11 , 2025 | 02:54 AM