Water Allocation: వరద జలాలపై మాకే సంపూర్ణ హక్కులు
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:12 AM
కృష్ణా నదీ జలాల వివాద ట్రైబ్యునల్ కేటాయించిన నికర జలాలతో పాటు వరద జలాలపైనా దిగువ రాష్ట్రంగా తమకే సంపూర్ణ హక్కులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ స్పష్టంచేసింది.
కృష్ణా ట్రైబ్యునల్ ముందు ఏపీ స్పష్టీకరణ
వచ్చే నెల 29, 30, 31 తేదీల్లో కొనసాగనున్న వాదనలు
అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ జలాల వివాద ట్రైబ్యునల్ కేటాయించిన నికర జలాలతో పాటు వరద జలాలపైనా దిగువ రాష్ట్రంగా తమకే సంపూర్ణ హక్కులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ స్పష్టంచేసింది. గురువారం బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్-2 ముందు రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు ప్రారంభించారు. ఎగువన ఉన్న తెలంగాణ నుంచి దిగువన ఉన్న తమ ప్రాజెక్టుల్లోకి కృష్ణా జలాలు వచ్చేశాక.. వాటిపై పూర్తి హక్కు తమకే ఉంటుందన్నారు. తమ భూభాగంలోకి వచ్చిన జలాలపై తెలంగాణకు ఎలాంటి హక్కులూ ఉండబోవని తెలిపారు. సోమ, మంగళ, బుధవారాల్లో తెలంగాణ వాదనలు వినిపించగా.. గురువారం ఏపీ వాదనలు ప్రారంభమయ్యాయి. తదుపరి విచారణ వచ్చే నెలాఖరుకు వాయిదాపడింది. అక్టోబరు 29, 30, 31 తేదీల్లో ఏపీ వాదనలు కొనసాగుతాయని ట్రైబ్యునల్ పేర్కొంది. కాగా.. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో తమకు 70ు వాటా ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.