Share News

AP Cabinet Decision : చేనేతలకు ఉచిత విద్యుత్‌

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:26 AM

చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

AP Cabinet Decision : చేనేతలకు ఉచిత విద్యుత్‌

  • ఇళ్లకు 200 యూనిట్లు.. పవర్‌లూంకు 500 యూనిట్లు

  • కేబినెట్‌ ఓకే.. ఎన్నికల హామీ నిలబెట్టుకున్న చంద్రబాబు

  • రాజధాని పనుల ప్రారంభానికి రైట్‌రైట్‌

  • ఉపాధ్యాయ బదిలీల ముసాయిదా బిల్లుకు ఆమోదం

  • బుడమేరు మరమ్మతులకు రూ.18 కోట్లు

  • వైఎస్సార్‌ జిల్లా ఇకపై వైఎస్సార్‌ కడప జిల్లా

  • తాడిగడప మున్సిపాలిటీలో వైఎస్సార్‌ పేరు తొలగింపు

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పవర్‌లూం యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాల వల్ల 93 వేల చేనేత కార్మికుల కుటుంబాలకు, 10,534 పవర్‌లూం యూనిట్లకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల సమయంలో ఈ రెండు హామీలూ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని నెరవేర్చారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సోమవారం అమరావతి సచివాలయంలో 4 గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో వివిధ పనులను ఆయా సంస్థలకు అప్పగించేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం 2025ను ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది.


మరిన్ని మంత్రివర్గ నిర్ణయాలివీ..

  • సీఆర్‌డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమీక్షించి మంత్రుల బృందం చేసిన సిఫారసులను ఆమోదించడానికి.. అమరావతి భూ కేటాయింపు నియమ, నిబంధనలు-2017 ప్రకారం వాటిపై చర్యలు తీసుకోవడానికి సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి.

  • రాజధాని ప్రాంతంలో.. ఏపీ ట్రాన్స్‌కో 400 కేవీ డీసీలైన్‌, పీజీసీఐఎల్‌ 400 కేవీ డీసీ లైన్ల రీరూటింగ్‌, బ్యాలెన్స్‌ పనుల కోసం రూ.390.06 కోట్లతో పిలిచిన టెండర్లను 8.99 శాతం ఎక్సె్‌సకు మెస్సర్స్‌ పీవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌, ప్రాజెక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు అప్పగించేందుకు ఆమోదం. అలాగే రాజధాని ప్రాంతంలో ఎన్‌10 నుంచి ఎన్‌13-ఈ1 జంక్షన్‌ వరకు యూజీ కేబుల్స్‌ ద్వారా 220 కే వీ లైన్ల రీరూటింగ్‌, బ్యాలెన్స్‌ పనులకు రూ.1,082.44 కోట్లతో పిలిచిన టెండర్లను 8.98 శాతం ఎక్సెస్‌కు బెంగళూరుకు చెందిన బీఎ్‌సఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌కు అప్పగించేందుకు అంగీకారం.

  • రాజధాని ప్రాంతంలో రూ.834. 46 కోట్లతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణం, వరద నీటి కాల్వ, జాతీయరహదారి-16 వరకు ఈ13 రోడ్డు విస్తరణకు ఏకమొత్తంగా రెండేళ్ల డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌తో పరిపాలనా అనుమతి కోసం ఏపీడీసీఎల్‌ ప్రతిపాదనకు ఆమోదం. రూ.307.59 కోట్లతో చేపట్టనున్న రోడ్లు, వరదనీటి కాల్వ, పాత జాతీయరహదారి మంగళగిరి వరకు ఈ15 రోడ్డు విస్తరణకు రెండేళ్ల డిఫెక్ట్‌ లయబిలిటీతో పరిపాలనా అనుమతికి ఆమోదం

  • రాజధాని ప్రాంతంలో రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు ఎల్‌1 బిడ్లను ఆమోదించడానికి సీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు, ఎల్‌1 బిడ్డర్లకు ఈ పనులను అప్పగించడానికి ఎల్‌వోఏలు జారీ చేసేం అధికారం అప్పగించేందుకు ఆమోదం.

  • ప్రపంచబ్యాంకు, ఏడీబీ, హడ్కో, కేఎ్‌ఫడబ్ల్యూ, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకుంటున్న అప్పుతో చేపట్టే రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీకి సంబంధించి ఇటీవల సీఆర్‌డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయం అమలుకు ఏడీసీఎల్‌ సీఎండీకి అధికారం.


  • ఎన్టీఆర్‌ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్‌ రెగ్యులేటర్‌ మెకానికల్‌, ఎలక్ర్టికల్‌ వస్తువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు రూ.18 కోట్లు కేటాయించేందుకు నిర్ణయం. బుడమేరు డైవర్షన్‌ చానల్‌ 3.840 కిలోమీటరు నుంచి 4.340 కిమీ వరకు కుడి, ఎడమ వరద నివారణ రక్షణ గోడల నిర్మాణానికి అనుమతి.

  • వైఎస్సార్‌ జిల్లా పేరును వైఎస్సార్‌ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం. వైఎస్సార్‌ తాడిగడప పేరులో వైఎస్సార్‌ తొలగించి.. తాడిగడప మున్సిపాలిటీగా మార్పు.

  • రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 205 ద్వారా లభించిన అధికారానికి లోబడి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తదుపరి ఖర్చుల కోసం గ్రాంట్లు.. డిమాండ్ల అనుబంధ ప్రకటనకు ఆమోదం.

  • గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో బ్రౌన్‌ఫీల్డ్‌ కేటగిరీ కింద వాసిరెడ్డి వెంటాద్రి ప్రైవేటు యూనివర్సిటీ స్థాపనకు అనుమతి.

  • ఏపీ ఇన్నోవేషన్‌, స్టార్టప్‌ పాలసీ (2024-29) ప్రకారం స్టార్టప్‌ ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడానికి ఐటీఈ, సీ విభాగానికి అనుమతి.

  • రాష్ట్రంలో ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫారసులకు ఆమోదం.

  • ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024 కింద అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 4,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్‌ ప్రాజెక్టులను మెస్సర్స్‌ ఏపీ ఎన్‌జీఈఎల్‌ హరిత్‌ అమృత్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయడానికి ఆమోదం.

  • అన్నమయ్య, కడప జిల్లాల్లో 1800 మెగావాట్ల ఆఫ్‌ స్ట్రీమ్‌ క్లోజ్డ్‌ లూప్‌ పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు మెస్సర్స్‌ ఆస్తా గ్రీన్‌ ఎనర్జీకి అటవీ పరిరక్షణ నిమిత్తం 350 హెక్టార్ల భూమి కేటాయింపు.

  • కొత్త పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు, ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటుకు ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందాన్ని ఆమోదించాలని జెన్‌కో ఎండీ చేసిన ప్రతిపాదనకు ఆమోదం.

  • గత ఏడాది కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంభవించిన వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో అత్యవసర ప్రాతిపదికన రూ.63.73 కోట్లతో నామినేషన్‌ పద్ధతిలో చేపట్టిన పనులకు అనుమతులు.


చేనేతలకు ఉచిత విద్యుత్‌కు 126 కోట్లు

చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు 96.76 కోట్లు. పవర్‌లూమ్‌ యూనిట్లకు ఉచిత కరెంటుకు 28.16 కోట్లు.. మొత్తంగా రూ.126.92 కోట్లు వ్యయమవుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుంది.

షిర్డీ సాయి సంస్థపై కేబినెట్‌లో ఆసక్తికర చర్చ

అది వైసీపీ కంపెనీ!

షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకు రామాయపట్నం వద్ద సోలార్‌ ప్లేట్ల తయారీకి 8,365 ఎకరాలు కేటాయించడంపై కేబినెట్‌ భేటీలో ఆసక్తికర చర్చ జరిగింది. దీనికి వైసీపీ అనుకూల సంస్థగా పేరుందని, అలాంటి సంస్థకు పెద్ద ఎత్తున భూకేటాయింపులు చేయడం సరికాదని పలువురు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని.. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థల విషయంలో పార్టీలను చూడడం సరికాదని.. నిబంధనల ప్రకారం నడచుకుంటున్నారా.. కేటాయించిన భూమిని నిర్దేశిత అవసరాలకే వినియోగిస్తున్నారా అన్నవే చూడాలని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Updated Date - Mar 18 , 2025 | 04:29 AM