Investment Benefits: క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థలకు భారీగా ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:03 AM
రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
సానుకూల వాతావరణ కల్పనకు ప్రభుత్వ నిర్ణయం
పెట్టుబడులకు అనుగుణంగా రాయితీలు
స్టార్ట్‌పలకూ పలు ఇన్సెంటివ్‌లు
2025-30కు మార్గదర్శకాలు విడుదల
అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో పెట్టుబడులు పెట్టే సంస్థలకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ 2025-30కు సంబంధించి సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్, అనుబంధ సంస్థల నిర్వహణలో అనుభవాన్ని వినియోగించుకోవడం, స్టార్ట్‌పలకు ప్రోత్సాహకాలను ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో సానుకూల వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మార్గదర్శకాల ఉత్తర్వుల్లో ఐటీశాఖ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ఆ సంస్థలకు ‘టైలర్‌మేడ్ ఇన్సెంటివ్’ విధానంలో ప్రోత్సాహకాలను ఇచ్చి మరింత ప్రోత్సహించనుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సమయంలోనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని, అనుమతులు పొందాలి. పెద్ద కంపెనీయా? స్టార్టప్ కంపెనీయా? అనేది కూడా అప్పుడే చెప్పాలి. దీని ఆధారంగా నిపుణుల కమిటీ ప్రోత్సాహకాలను ఇస్తుంది. స్టార్టప్ కంపెనీలు నిర్వహించే కార్యక్రమాలు, వాటికి అయ్యే వ్యయాన్ని, అర్హతగల స్టార్ట్‌పలకు రెంటల్ సబ్సిడీని ఐటీ శాఖ భరిస్తుంది. హార్డ్ వేర్ సేవలకూ ప్రోత్సాహకాలను అందిస్తారు. స్టాంప్ డ్యూటీలో వంద శాతం రాయితీని ఇస్తారు. మెషినరీ కొనుగోలు పన్నులను పూర్తిగా చెల్లిస్తారు. విద్యుత్తు చార్జీల్లోనూ రాయితీని ఇస్తారు. సంస్థ స్థాపించిన ఆరు నెలల్లోనే ఎస్‌జీఎ్‌సటీ సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. రూ. 10 కోట్లు వరకూ, ఆపైబడి పెట్టుబడులు పెట్టే సంస్థలకూ సమయానుకూలంగా ప్రోత్సాహాకాలను అందిస్తారు. ప్రోత్సాహకాలను మూడు దశల్లో ప్రభుత్వం చెల్లిస్తుంది.
మొదటిదశలో 15 శాతం, రెండో దశలో 30 శాతం, మూడో దశలో 55 శాతం చొప్పున చెల్లిస్తారు. ప్రోత్సాహాకాల కోసం రాష్ట్ర క్వాంటమ్ మిషన్ కార్యనిర్వాహక కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఎర్లీ బర్డ్ పథకం కింద మొదటి 20 సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తారు. సంస్థల్లోని టాలెంట్‌ను కూడా ప్రోత్సహిస్తారు. పెట్టుబడులకు అనుగుణంగా రాయితీలను ఇస్తారు. ఈ మార్గదర్శకాలకు లోబడి క్వాంటమ్ కంప్యూటింగ్, స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహకాలు వెంటనే విడుదల అవుతాయి.