AP CS K. Vijayanand: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రస్థానం లక్ష్యం
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:34 AM
ఏపీని 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిని చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వయిజరీ బోర్డు...
రాష్ట్రంలో హబ్ ఏర్పాటు దిశగా ముమ్మర చర్యలు: సీఎస్
అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఏపీని 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిని చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వయిజరీ బోర్డు కో-చైర్మన్ కె.విజయానంద్ చెప్పారు. బోర్డు తొలి సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద హైడ్రోజన్ హబ్ రూపొందిస్తున్నామని సీఎస్ తెలిపారు. రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడితో 20 గిగావాట్ రెన్యువబుల్ ఎనర్జీ సామర్థ్యంతో రోజుకు సుమారు 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కృషి జరుగుతోందని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు, అడ్వయిజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ వీకే సారస్వత్ మాట్లాడుతూ.. గ్రీన్ హైడ్రోజన్‌ను స్థానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్లు, ఎరువుల తయారీ పరిశ్రమలు, ఓడరేవులు పెద్ద ఎత్తున వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ సదస్సులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించిన కొన్ని ఎంవోయూలు జరగనున్నట్లు ఏపీ గ్రీన్‌కో ఏజీఎం డాక్టర్ రామ్‌కుమార్ తెలిపారు.