Minister Anam Ramanarayana Reddy: ఆధ్యాత్మిక రాష్ట్రమే లక్ష్యం
ABN , Publish Date - Dec 14 , 2025 | 05:13 AM
అభివృద్ధి, సంక్షేమంతో పాటు దేశంలోనే నంబర్ వన్ ఆధ్యాత్మిక రాష్ట్రమే లక్ష్యంగా పని చేస్తామని దేవదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
98 శాతం హమీలు నేరవేర్చాం
846 కోట్లతో 1,058 ఆలయాల పునర్నిర్మాణం
ధార్మిక భవన్ సేవలు.. ‘కర్నూలు టు కాణిపాకం’: మంత్రి ఆనం
కర్నూలు అర్బన్, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమంతో పాటు దేశంలోనే నంబర్ వన్ ఆధ్యాత్మిక రాష్ట్రమే లక్ష్యంగా పని చేస్తామని దేవదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శనివారం కర్నూలు నగర శివారులో నూతనంగా నిర్మించిన ధార్మిక భవనం... కర్నూలు జోన్ పరిపాలన భవన సముదాయాన్ని మరో మంత్రి టీజీ భరత్ తో కలసి ఆనం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ హరిజవహర్ లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, కలెక్టర్ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ... ‘కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో దేవదాయ శాఖ 98 శాతం హమీలు అమలు చేసింది. విజయవాడలోని గొల్లపూడిలో ఉన్నట్లుగానే, రాయలసీమలోని కర్నూలులో రూ.4.91 కోట్లతో ధార్మిక భవనాన్ని నిర్మించాం. రాయలసీమలోని కర్నూలు టూ కాణిపాకం ఆలయం వరకు పాలనాపరమైన అంశాలకు ఈ కార్యాలయం కీలకంగా పని చేస్తుంది. ఆలయాల్లో ఉత్సవాలు, పూజా కైంకర్యాలు వైదిక నిర్ణయాల ప్రకారం చేస్తున్నామని తెలిపారు. అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలు, వేద విద్య నేర్చుకున్న పండితులకు సంభావన కింద నెలకు రూ.3 వేలు ఇస్తున్నాం. దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం. 20 వేల ఆయయాల్లో 3,700 గోవులను సంరక్షిస్తున్నాం. దేవదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చాం. సెలక్షన్ ప్రక్రియ కూడా త్వరలో మొదలు పెడతాం.
సీఎం చంద్రబాబు కార్యచరణ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలు, ప్రదానీ మోదీ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాల కింద పత్రి ఆలయానికి ప్రతి నెల రూ.10 వేలు ఇస్తున్నాం. రాష్ట్రంలో 1,058 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.846 కోట్లు కేటాయించాం. 2027 జూన్ 26న గోదావరి పుష్కరాలను 12 రోజుల పాటు నిర్వహించేందుకు ఆగమ పండితుల సూచనల మేరకు నిర్ణయించాం. 2028లో కృష్ణ పుష్కరాలు నిర్వహించేందుకు చర్చలు జరుగుతున్నాయి. గోదావరి పుష్కరాల సందర్భంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 31 పెద్ద ఆలయాల మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాం’ అని పేర్కొన్నారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ... ‘ఎంతో అవగాహన, విషయ పరిజ్ఞానం ఉన్న ఆనం రాంనాయరాణ రెడ్డి లాంటి వ్యక్తి ఉండటం వల్ల దేవదాయశాఖ ఎంతో సమర్థంగా పనిచేస్తోంది. శాసనమండలిలో ప్రత్యర్థి పార్టీ నాయకులు వేసే ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానంతో తిరుగుమాట ఉండదు’ అని అన్నారు. సీనియారిటీని పక్కన పెట్టి, ఈఓలను కాదని అడ్డదారరిలో సీనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇచ్చారంటూ వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.