Gulf Christmas Celebrations: గల్ఫ్‌లో ఆంధ్ర క్రిస్మస్ కళ
ABN , Publish Date - Dec 29 , 2025 | 03:38 AM
క్రీస్తు జన్మించిన ఎడారి దేశాల్లో ఒకప్పుడు క్రైస్తవం వికసించి.. తర్వాత అవిర్భవించిన ఇస్లాం కారణంగా అదృశ్యమైంది! అయుతే, చమురు ఉత్పత్తి, విదేశీయుల వలసలు, భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన క్రైస్తవుల వల్ల ఇప్పుడక్కడ క్రైస్తవ..
వేడుకలకు వన్నె తెచ్చిన ఉభయ గోదావరి జిల్లాల క్రైస్తవులు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
క్రీస్తు జన్మించిన ఎడారి దేశాల్లో ఒకప్పుడు క్రైస్తవం వికసించి.. తర్వాత అవిర్భవించిన ఇస్లాం కారణంగా అదృశ్యమైంది! అయుతే, చమురు ఉత్పత్తి, విదేశీయుల వలసలు, భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన క్రైస్తవుల వల్ల ఇప్పుడక్కడ క్రైస్తవ ఆధ్యాత్మికం పునరుజ్జీవం పొందుతోంది. భారతీయ క్రైస్తవుల్లో మలయాళీలు, తమిళుల తర్వాత, ప్రత్యేకించి ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన తెలుగువారు గల్ఫ్ దేశాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా ప్రతి తెలుగు చర్చి నరసాపురం, భీమవరం లేదా సఖినేటిపల్లి, రాజోలులోని చర్చిల తరహా ముస్తాబయ్యాయి. దుబాయి, అబుధాబి, కువైత్, మస్కట్, మనమా, దోహాలలో నిర్వహించిన వేడుకలు.. గోదావరి తీరంలోని చర్చిల్లో నిర్వహించే పండుగ తీరును ప్రతిబింబించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్టర్లు, రెవరెండ్లు ఇతర ప్రముఖులు వచ్చి భక్తులనుద్దేశించి వాక్యోపదేశం చేశారు. గల్ఫ్‌లో ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన కువైత్‌లోని తెలుగు చర్చి సువిశాల ప్రాంగణం పెద్ద సంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక్కడి వేడుకల్లో పాల్గొంటే.. సొంత గడ్డపై పండుగ జరుపుకుంటున్న అనుభూతి కలుగుతుందని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అనిల్ చెప్పారు. ఏడాదికి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసే పేదలు అనేకమంది ఉన్నారని, ఇలాంటి అభాగ్యులకు క్రిస్మస్ వేడుకలు నిస్సందేహాంగా సంతోషకరమైన రోజని ఖతర్‌లోని ప్రముఖ చర్చి ప్రతినిధి వర్జిల్ బాబు వ్యాఖ్యానించారు. తాము నిర్వహించిన వేడుకల్లో ఐదువేల మంది పాల్గొన్నట్లు తెలిపారు.