Share News

ఇంకా ‘ఆపరేట్‌’ర్లు!

ABN , Publish Date - Jul 09 , 2025 | 01:17 AM

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో ఎండీయూ ఆపరేటర్ల పాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. అవినీతికి అలవాటుపడిన కొందరు రేషన్‌ డీలర్లు వీరిని తమ వద్ద గుమస్తాలుగా నియమించుకున్నారు. వీరి ద్వారా కార్డుదారులకు ఫోన్లు చేసి భారీగా బియ్యం కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. ఎండీయూ ఆపరేటర్లకు దూరంగా ఉండాలని రేషన్‌ డీలర్లకు సివిల్‌ సప్లయిస్‌ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను బేఖాతర్‌ చేస్తున్నారు.

 ఇంకా ‘ఆపరేట్‌’ర్లు!

- ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలో ఆగని రేషన్‌ దందా!

- రేషన్‌ డీలర్ల వద్ద గుమస్తాలుగా ఎండీయూ ఆపరేటర్లు

- కార్డుదారులకు ఫోన్లు.. భారీగా బియ్యం కొనుగోళ్లు

- ఎండీయూ వాహనాల్లో రైస్‌ మిల్లులకు తరలింపు

- విజయవాడలో ఆపరేటర్లను పట్టుకున్న పోలీసులు

- కృష్ణాజిల్లా గూడూరులోని ఓ రైస్‌ మిల్లులో బియ్యం సీజ్‌ చేసిన అధికారులు

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో ఎండీయూ ఆపరేటర్ల పాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. అవినీతికి అలవాటుపడిన కొందరు రేషన్‌ డీలర్లు వీరిని తమ వద్ద గుమస్తాలుగా నియమించుకున్నారు. వీరి ద్వారా కార్డుదారులకు ఫోన్లు చేసి భారీగా బియ్యం కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. ఎండీయూ ఆపరేటర్లకు దూరంగా ఉండాలని రేషన్‌ డీలర్లకు సివిల్‌ సప్లయిస్‌ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను బేఖాతర్‌ చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) ఆపరేటర్లకు రేషన దుకాణాలు పునరావాస కేంద్రాలుగా మారాయి. కొందరు రేషన డీలర్లు తమ దుకాణాల్లో ఎండీయూ ఆపరేటర్లను గుమాస్తాలుగా నియమించుకున్నారు. కార్డుదారుల నుంచి పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేయటానికి వీరిని వాడుకుంటున్నారు. దీంతో ఈ నెలలో కూడా పేదల బియ్యం భారీగా పక్కదారి పడుతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 100 శాతం దాటి కూడా పంపిణీ చేసిన డీలర్లు కొందరైతే 50 శాతం లోపు పంపిణీ చేసిన డీలర్లు మరికొందరు ఉన్నారు. గతంలో డోర్‌ డెలివరీ ఉన్నప్పుడు ఎండీయూ ఆపరేటర్లు అనేక చౌక దుకాణాల పరిధిలో రేషన బియ్యాన్ని ఇంటింటికీ పంపిణీ చేసేవారు. వీరికి కార్డుదారులెవరు బియ్యాన్ని తిరిగి విక్రయిస్తారో తెలుసు. ఇలా విక్రయించేవారి ఫోన నెంబర్లన్నీ కూడా ఎండీయూ ఆపరేటర్ల దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం డీలర్ల దగ్గర గుమాస్తాలుగా పనిచేస్తున్న ఎండీయూ ఆపరేటర్లు కార్డుదారులకు ఫోన్లు చేసి బియ్యాన్ని కొనుగోలు చేస్తామని, తాము ఉన్న డిపోలకు రావాలంటూ చెబుతున్నారు. దీంతో డబ్బులు ఎక్కువు వస్తున్నాయన్న ఉద్దేశంతో కార్డుదారులు ఆ రేషన దుకాణానికి వెళుతున్నారు. ఇలా ఎండీయూ ఆపరేటర్లు ఉన్న డిపోలలో 100 శాతం కూడా పంపిణీ దాటి పోతోంది. బియ్యం కొంటారన్న ఉద్దేశంతో తమ పరిధిలోని రేషన దుకాణాలను కూడా కాదని కార్డుదారులు ఎండీయూ ఆపరేటర్లు పనిచేస్తున్న దుకాణాల దగ్గరకు వెళ్లి బయోమెట్రిక్‌ వేసి బియ్యాన్ని వారికే విక్రయిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న డిపోలలో 50 శాతం మేర పంపిణీ పడిపోయింది.

డీలర్ల వద్ద ఉద్యోగం

ఎన్టీఆర్‌ జిల్లాలో జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం మండలాల పరిధిలో పెద్ద ఎత్తున డీలర్లు ఎండీయూ ఆపరేటర్లను గుమాస్తాలుగా నియమించుకున్నారు. విజయవాడ నగరంలో కృష్ణలంక, టూటౌన, పటమట, గుణదల తదితర ప్రాంతాల్లో ఎండీయూ ఆపరేటర్లను రేషన డీలర్లు తమ ఉద్యోగులుగా చేర్చుకున్నారు. కృష్ణాజిల్లాలో ప్రధానంగా గుడివాడ, కంకిపాడు, గన్నవరం, అవనిగడ్డ, మచిలీపట్నం, కోడూరు మండలాల పరిధిలోని రేషన డీలర్లు తమ షాపుల్లో ఎండీయూ ఆపరేటర్లను పెట్టుకుని నడుపుతున్నారు. ఎండీయూ ఆపరేటర్లను తొలగించిన తర్వాత వారితో సంబంధాలు కొనసాగించవద్దని, వారిని దగ్గరకు తీసుకోవద్దని సివిల్‌ సప్లయిస్‌ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కూడా రేషన డీలర్లు బేఖాతర్‌ చేస్తున్నారు.

రేటు పెంచి కొంటున్నారు!

కార్డుదారులను ఆకర్షించటానికి రేషన డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు తెలివైన ఎత్తుగడ వేశారు. గతంలో రూ.10లకు ఎండీయూ ఆపరేటర్లు రేషన బియ్యాన్ని కొనుగోలు చేసేవారు. ఇప్పుడు రేషన డీలర్లు ఈ ధరను అమాంతం పెంచేశారు. కేజీకి రూ.13 నుంచి రూ. 14 వరకు చెల్లిస్తామని ఎండీయూ ఆపరేటర్ల ద్వారా కార్డుదారులకు ఫోన్లు చేయిస్తున్నారు. దీంతో ధర ఎక్కువుగా పలకటంతో కార్డుదారులు కూడా ఎండీయూ ఆపరేటర్లు చెప్పి దుకాణాలకే వెళుతున్నారు. ఈ ధరను ఎందుకు పెంచారన్నదానికి కూడా కారణం ఉంది. రేషన బియ్యంలో అనేక పోషకాలు ఉంటాయి. ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున వీటికి డిమాండ్‌ ఉంది. ఇటీవల కాలంలో ధర కూడా బాగా పలుకుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రూ.3 నుంచి రూ. 4 వరకు అదనంగా పెంపుదల చేశారు.

పోలీసులకు పట్టుబడుతున్న ఎండీయూ ఆపరేటర్లు

జూలై నెల కోటా ప్రారంభం కాగానే కొంతమంది ఎండీయూ ఆపరేటర్లు రేషన బియ్యాన్ని వాహనాలలో తరలిస్తూ పలు చోట్ల పోలీసులకు పట్టుబడ్డారు. పటమట నల్లూరి సత్యనారాయణ నగర్‌కు చెందిన పందిరిపల్లి మల్లికార్జున, బావాజీపేటకు చెందిర కురిటి దుర్గాప్రసాద్‌లను తమ వాహనాలలో బియ్యం బస్తాలను తరలిస్తుండగా మాచవరం పోలీసులు పట్టుకున్నారు. కృష్ణాజిల్లా గూడూరులో గోమతి రైస్‌ మిల్లుపై విజిలెన్స అధికారులు దాడులు జరిపి.. ఆవరణలో ఉన్న రేషన బియ్యాన్ని సీజ్‌ చేశారు. దీనిని బట్టి ఏ స్థాయిలో ఎండీయూ ఆపరేటర్ల ద్వారా బియ్యం తరలిపోతోందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Jul 09 , 2025 | 01:17 AM