Kalamall inscription: తొలి తెలుగు శాసనానికి అందలం!
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:57 AM
వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలో ఉన్న చెన్నకేశవ-సిద్ధేశ్వర ఆలయంలో 6వ శతాబ్దానికి చెందిన కలమల్ల శాసనం తెలుగు భాషా చరిత్రలో...
కలమల్ల శాసనం తెలుగు ప్రాచీనతకు సాక్ష్యం
మొత్తం 11 పంక్తులకు గాను మిగిలింది ఏడే
1904లో నమోదు చేసిన పురావస్తు శాఖ
మళ్లీ 2022లో కలమల్లలోనే గుర్తింపు
ఈ నెల 21న కడపలో నమూనా ఆవిష్కణ
కడప ఎడ్యుకేషన్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలో ఉన్న చెన్నకేశవ-సిద్ధేశ్వర ఆలయంలో 6వ శతాబ్దానికి చెందిన కలమల్ల శాసనం తెలుగు భాషా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. చోళరాజు ధనుంజయుడు దీన్ని రాయించారని చరిత్రకారులు గుర్తించారు. ఈ శాసనంలో మొత్తం 11 పంక్తులు ఉండగా ప్రస్తుతం ఏడు మాత్రమే మిగిలాయి. ‘ఎరికల్ ముత్తురాజు అనే బిరుదు గల రాజు’ అంటూ ప్రారంభమై ‘ఈ శాసనానికి ఎటువంటి ఆటంకం కలిగించినా.. వారు పంచ మహాపాతకులవుతారని’ పేర్కొంటూ ముగుస్తుంది. బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు లిపి పరిణామం చెందిన క్రమం దీని ద్వారా తెలుస్తుంది. ‘వారు’ అనే బహువచన పద వాడకం ఇందులో కనిపిస్తోంది. 1904లో భారత పురావస్తు శాఖ (ఏఎ్‌సఐ) ఈ శాసనాన్ని నమోదు చేసింది. ఇది పూర్తిగా తెలుగులో ఉండటం విశేషం. కాగా.. ప్రారంభంలో సుమారు 5.6 అడుగుల ఎత్తున్న ఈ రాతి శాసనం ప్రస్తుతం 4 అడుగులకు పరిమితమైంది. అక్షరాలు మసకబారి చదవలేని స్థితికి చేరాయి. పురావస్తు శాఖ 1904లో నమోదు చేసినా.. ఆ శాసనం ఎక్కడ ఉందో తర్వాత ఎవరికీ తెలీదు. 2012లో తిరుపతిలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ శాసనం కోసం అన్వేషణ సాగింది. దీంతో భాషావేత్త, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, అప్పటి ఏఎ్‌సఐ శాసన విభాగం డైరెక్టర్ కె.మునిరత్నంరెడ్డి నేతృత్వంలో చెన్నై ఎగ్మోర్ మ్యూజియం, లండన్ మ్యూజియం వరకు అన్వేషించినా ఫలితం లభించలేదు. చివరకు 2022 జనవరిలో కలమల్ల గ్రామంలోనే ఈ శాసనాన్ని గుర్తించారు. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ భవిష్యత్తులో అంతరించి పోయే దశలో ఉంది. దీంతో ఈ శిలాశాసనాన్ని కాపాడాలనే ఉద్దేశంతో జానమద్ది సాహితీ పీఠం చొరవతో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడప సీపీ బ్రౌన్ పరిశోధనా కేంద్రంలో దీని నమూనా (రెప్లికా)ను ఏర్పాటు చేశారు. దీనిని జానమద్ది హనుచ్ఛాస్ర్తి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21న ఆవిష్కరించనున్నారు.