Ration Rice Scam: అనంతలో రేషన్ బియ్యం దందా
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:25 AM
అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో రేషన్ బియ్యం దందా వెలుగు చూసింది. ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 200 టన్నులకుపైగా రేషన్ బియ్యాన్ని పోలీసులు...
రైస్‌మిల్లులో భారీగా ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత
యాడికి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో రేషన్ బియ్యం దందా వెలుగు చూసింది. ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 200 టన్నులకుపైగా రేషన్ బియ్యాన్ని పోలీసులు, పౌరసరఫరాల అధికారులు గుర్తించారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్‌చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం శనివారం రాత్రి రెండు వాహనాల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వీటిని యాడికి పోలీసు స్టేషన్‌కు తరలించారు. రైస్‌మిల్లులో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయనే అనుమానంతో ఆదివారం ఉదయం నుంచి బందోబస్తు ఏర్పాటుచేశారు. టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుని, రైస్‌మిల్లును సీజ్ చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైస్‌మిల్లు యజమాని అందుబాటులో లేకపోవడంతో అధికారులు అతని ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. రైస్‌మిల్లు తాళాలు తెరిచి, సోదాలు నిర్వహించారు. లోపల గుట్టలు, గుట్టలుగా ఉన్న రేషన్ బియ్యాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. 200 టన్నులకు పైగా రేషన్ బియ్యం నిల్వలు ఉంటాయని అంచనా వేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పోర్టిఫైడ్ బియ్యం ప్యాకెట్లు కూడా మిల్లులో పెద్ద మొత్తంలో ఉండడం గమనార్హం. వాటిని సీజ్‌చేసి పౌరసరఫరాల అధికారులకు అప్పగించనున్నట్టు పోలీసులు తెలిపారు.