Cyber Crime Police: సీఎంపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:12 AM
సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలతో సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన ‘శివ సుప్రీం శివ’ అరెస్ట్
గుంటూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలతో సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను శనివారం గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ ఎస్పీ కేవీ శ్రీనివాస్ వివరించారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన గడ్డం శివప్రసాద్ మెడికల్ రిప్రజెంటేటివ్. సుప్రీం శివ అనే ఫేస్‌బుక్ ప్రొఫైల్‌తో సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, కులాలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడు. ఆ పోస్టులపై గుంటూరు వికా్‌సనగర్‌కు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఈనెల 6న మంగళగిరిలోని సీఐడీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం శివప్రసాద్ అనంతపురం జిల్లా ధర్మవరంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. అతన్ని శనివారం గుంటూరులోని సీఐడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. కాగా, ఇటీవల యూరియాపై సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనను కొందరు మార్ఫింగ్ చేసి తప్పుడు వీడియోను సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేశారని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. సమావేశంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికిరణ్, గుంటూరు సీఐడీడీఎస్పీ సునీల్, సీఐ రాంబాబు పాల్గొన్నారు.