Anantapur DIG Shemushi Bajpai: మా చర్యలే బలంగా మాట్లాడతాయి
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:21 AM
పోలీసుల మాటల కంటే చర్యలు బలంగా మాట్లాడతాయని అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి కీలక వ్యాఖ్యలు చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు అనంత డీఐజీ షిమోషి కౌంటర్
అనంతపురం క్రైం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): పోలీసుల మాటల కంటే చర్యలు బలంగా మాట్లాడతాయని అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి కీలక వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఏఎస్పీ రోహిత్ కుమార్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన అవమానకర, అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలు పోలీసుల విధి నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలిగించలేవు. పోలీసుల నిబద్ధతను, మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు. ఆలిండియా సర్వీస్ సభ్యులుగా దేశానికి, పౌరులకు సేవ చేయడమే మా ప్రధాన ధ్యేయం. మతం, ప్రాంతం, కులం, వర్ణం మొదలైన ఏ తేడాలూ పోలీసుల సేవా ధోరణిని ప్రభావితం చేయలేవు. మా దృష్టిలో రాజ్యాంగం, చట్టాలు అత్యున్నతమైనవి. ఒక ఐపీఎస్ అధికారిని, లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగిని అవమానకర భాషలో సంబోధించడం పరిపాలనా ప్రమాణాలకు విరుద్ధం. శాంతి, భద్రత, చట్టాల స్వాతంత్ర్యాన్ని కాపాడటానికి పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుంది’ అని డీఐజీ పేర్కొన్నారు.