Anantapur Police: ఉన్మాదిపై పోలీసు తూటా
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:50 AM
మద్యం మత్తులో ఒకరిని పొడిచి పరారైన ఓ ఉన్మాదిని పోలీసులు పట్టుకోవడానికి వెళ్లగా వారిపైనా కత్తిదూశాడు.
మద్యం మత్తులో యువకుడిని పొడిచి పరార్
పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనా కత్తితో దాడి
కాలిపై కాల్పులు జరిపి నిందితుడిని పట్టుకున్న సీఐ
అనంతలో మాఫియా సినిమాను తలపించే ఘటన
అనంతపురం క్రైం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఒకరిని పొడిచి పరారైన ఓ ఉన్మాదిని పోలీసులు పట్టుకోవడానికి వెళ్లగా వారిపైనా కత్తిదూశాడు. ఈ దాడిలో పోలీసు ఇన్‌స్పెక్టర్ సైతం గాయపడగా, ఆయన నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. మాఫియా సినిమాను తలపించే ఈ ఘటన అనంతపురం జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం అరవింద నగర్‌లోని ఓ కేఫ్ వద్ద దేవరకొండ అజయ్, చాకలి రాజా, సొహైల్, అక్రమ్ అనే నలుగురు ఆదివారం రాత్రి మద్యం తాగారు. మద్యం విషయంలో రాజా, అజయ్ మధ్య గొడవ జరిగింది. రాజాను అజయ్ కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు, సోమవారం ఉదయం నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లారు. ఆటో డ్రైవర్ బాబాతో(పోలీసు ఇన్‌ఫార్మర్) కలిసి సీఐ శ్రీకాంత్ యాదవ్, సిబ్బంది నగర శివారులోని షికారి కాలనీలో అజయ్ ఉన్నట్లు గుర్తించి రౌండప్ చేశారు. దీంతో అజయ్ తిరగబడ్డాడు. కత్తితో బాబా కడుపులో పొడిచాడు. దీంతో బాబాకు పేగులు బయటకు వచ్చాయి. పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుళ్లు, స్థానికులను కూడా కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. పోలీసుల నుంచి తప్పించుకుని, కాలనీ వెనుకవైపు ఉన్న చెరువులోకి దూకి ఆకుతోటపల్లి వైపు పారిపోయాడు. బాబాను ఆసుపత్రికి తరలించి.. నిందితుడిని వెంబడించిన పోలీసులు చెరుకుతోట వద్ద ఏపుగా పెరిగిన గడ్డిలో దాక్కున్నట్లు గుర్తించారు.
సీఐ శ్రీకాంత్ యాదవ్ గడ్డి తోపులోకి వెళ్లి లొంగిపోవాలని కేకలు వేస్తుండగా అతనిపైనా నిందితుడు కత్తితో దాడి చేశారు. దీంతో సీఐ ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. సీఐ హెచ్చరిస్తున్నా గాల్లోకి కాల్పులు జరిపినా లొంగకపోవడంతో అజయ్ కుడికాలిపై కాల్చారు. బుల్లెట్ గాయమై నిందితుడు కిందపడిపోగానే అదుపులోకి తీసుకుని, అనంతపురం సర్వజన వైద్యశాలకు తరలించారు. సీఐ శ్రీకాంత్‌కు సర్వజన వైద్యశాలలో చికిత్స చేశారు. అజయ్ చేతిలో గాయపడిన చాకలి రాజా, ఆటో డ్రైవర్ బాబా చికిత్స పొందుతున్నారు. బాబా పరిస్థితి విషమంగా ఉంది. సీఐ శ్రీకాంత్‌ను ఎస్పీ జగదీశ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అజయ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.