Anantapur: నా భార్యను కలిస్తే చంపుతామంటున్నారు!
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:17 AM
అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన శేషానందరెడ్డి అనే వ్యక్తి సోమవారం ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు.

కూతురిని కలిసినందుకు అక్రమ కేసు
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి
భాస్కర్ రెడ్డిపై చర్యలు తీసుకోండి
అనంత ఎస్పీకి శేషానందరెడ్డి ఫిర్యాదు
అనంతపురం క్రైం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): తన భార్యను కలవనివ్వకుండా కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి అడ్డుకుంటున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన శేషానందరెడ్డి అనే వ్యక్తి సోమవారం ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కోరారు. కడప జిల్లా సింహాద్రిపురం గ్రామానికి చెందిన పి.శ్వేతతో 2016లో తనకు వివాహమైందని, తమకు ఒక కుమార్తె ఉందని తెలిపారు. 2019 తర్వాత మనస్పర్థలు రావడంతో.. శ్వేత కుమార్తెతో కలిసి పుట్టింట్లోనే ఉంటోందన్నారు. భార్యతో మాట్లాడేందుకు సింహాద్రిపురం వెళ్లినప్పుడల్లా వైఎస్ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి అడ్డుపడుతున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. సింహాద్రిపురం పోలీ్‌సస్టేషన్‌లో 2021లో తనపై అక్రమ కేసు పెట్టించారని, పులివెందుల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారని పేర్కొన్నారు. దీనిపై గవర్నర్, రాష్ట్రపతి, హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశానని తెలిపారు. అవినాశ్‌రెడ్డి పోలీసులకు ఫోన్ చేసి, తనపై దాడి చేయమని చెప్పిన రికార్డింగులు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు. ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని శేషానందరెడ్డిని స్థానిక వైసీపీ నాయకులు బెదిరించినట్లు సమాచారం.