Share News

Anantapur HDFC Bank Gold Scam: అసలు మాయం.. నకిలీతో మోసం

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:58 AM

అందరూ జల్సాలకు అలవాటుపడ్డారు! సులభంగా డబ్బు సంపాదనకు వక్రమార్గం పట్టారు!! ఏకంగా రుణాల కోసం ప్రజలు బ్యాంకులో పెట్టుకున్న బంగారాన్ని కొట్టేసి..

Anantapur HDFC Bank Gold Scam: అసలు మాయం.. నకిలీతో మోసం

  • అనంతపురం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో గోల్డ్‌ స్కామ్‌

  • నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

అనంతపురం క్రైం, జూలై 28(ఆంధ్రజ్యోతి): అందరూ జల్సాలకు అలవాటుపడ్డారు! సులభంగా డబ్బు సంపాదనకు వక్రమార్గం పట్టారు!! ఏకంగా రుణాల కోసం ప్రజలు బ్యాంకులో పెట్టుకున్న బంగారాన్ని కొట్టేసి.. వాటిని ఇతర ప్రైవేటు గోల్డ్‌ లోన్‌ సంస్థలో తనాఖా పెట్టి భారీగా సొమ్ము కాజేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది. ఈ స్కామ్‌లో సదరు బ్యాంకు గోల్డ్‌లోన్‌ ఆఫీసర్‌ కీలకంగా వ్యవహరించగా.. అతని స్నేహితులతో పాటు గోల్డ్‌ లోన్‌ సంస్థ మేనేజర్‌ భాగస్వామ్యమయ్యారు. రూ.2 కోట్ల బంగారానికి సంబంధించిన ఈ స్కామ్‌లో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు. అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసరావు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి, కేసు వివరాలు వెల్లడించారు. బ్యాంకులో బంగారం రుణం గడువు తీరినవారు రెన్యువల్‌ చేసుకునేందుకు వస్తే.. ‘లోన్‌ క్లోజర్‌’ కాగితాలపై సంతకాలు చేయించుకొని, ఆ బంగారాన్ని తీసుకెళ్లి ప్రైవేటు గోల్డ్‌లోన్‌ సంస్థలో కుదువపెట్టి సొమ్ము కాజేశారని పేర్కొన్నారు. బ్యాంకు అధికారుల కళ్లుగప్పేందుకు అసలు బంగా రం స్థానంలో నకిలీ బంగారాన్ని ఉంచారని తెలిపారు. ఈ క్రమంలో ప్రైవేటు గోల్డ్‌ లోన్‌ కంపెనీకీ కూడా టోకరా వేశారని, బ్యాంకులో కాజేసిన బంగారానికి కొంత నకిలీ కూడా కలిపి అక్కడ తాకట్టు పెట్టారన్నారు.

Untitled-5 copy.jpg


బ్యాంకు ఆఫీసరే రింగ్‌ మాస్టర్‌!

అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన వెంకటంపల్లి సతీష్ కుమార్‌ రామ్‌నగర్‌ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో గోల్డ్‌ లోన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. జాకీర్‌ కొట్టాలకు చెందిన జయరాములు గతంలో ఇదే బ్రాంచిలో సేల్స్‌ ఆఫీసర్‌గా పనిచేశాడు. సతీ ష్‌కు గణేష్ నగర్‌కు చెందిన సాయికృష్ణ స్నేహితుడు. నందమూరి నగర్‌కు చెందిన బోయ శ్రీనివాసులు.. సతీష్‌కు పరిచయమయ్యాడు. అలాగే అనంతపురంలోని కీర్తన ఫైనాన్స్‌లో మేనేజర్‌గా చేస్తున్న నరేష్‌తో సతీ ష్‌కు పరిచయాలు ఉన్నాయి. జల్సాలకు అలవాటు పడ్డ వీరంతా.. ఏకమై బంగారం స్కామ్‌కు పాల్పడ్డారు.


అసలు, నకిలీ కలిపి 2,180 గ్రాములు..

సతీష్ కుమార్‌ మిగిలిన నలుగురితో కలిసి కుట్రను అమలు చేశాడు. బంగారం రుణాల రెన్యువల్‌ పేరిట కస్టమర్లతో డాక్యుమెంట్లపై సంతకాలు చేయించేవాడు. వాటి ఆధారంగా లోన్‌ను క్లోజ్‌ చేసి, కస్టమర్లు వెళ్లిన తర్వాత సీల్డ్‌ కవర్‌లో ఉన్న అసలు ఆభరణాలను బయటకు తీసి, నకిలీ ఆభరణాలను అందులో పెట్టేవాడు. కొన్ని అసలువి, కొన్ని నకిలీవి తీసుకెళ్లి కీర్తన ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రుణాలు పొందేవారు. అక్కడ మేనేజర్‌గా వీరి మిత్రుడు నరేష్‌ ఉండటంతో ఈ తతంగం సాఫీగా సాగిపోయేది. కీర్తన ఫైనాన్స్‌లో సాయికృష్ణ పేరిట 1,200 గ్రాములు, శ్రీనివాసులు పేరిట 650 గ్రాములు, జయరాములు పేరిట 330 గ్రాములు.. ఇలా మొత్తం 2,180 గ్రాములు తనఖా పెట్టారు. ఇప్పటిదాకా రూ.2 కోట్ల దాకా మోసం జరిగినట్లు గుర్తించారు. నిందితులు సతీష్‌, జయరాములు, సాయికృష్ణ, శ్రీనివాసులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మరో కీలక నిందితుడు నరేష్‌ పరారీలో ఉన్నాడు.

Updated Date - Jul 29 , 2025 | 05:00 AM