Sub Registrar Anand Reddy: మంత్రి చెబితే మాకేంటి!
ABN , Publish Date - Nov 29 , 2025 | 05:13 AM
తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చాలా ఫేమస్. ఇక్కడి ఆఫీసుపై లెక్కలేనన్ని ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ సబ్‌రిజిస్ట్రార్‌గా ఆనంద రెడ్డి...
రిజిస్ట్రేషన్ల శాఖలో బరితెగింపు ‘పోస్టింగ్’
మంత్రి, స్పెషల్ సీఎ్‌సను కాదని నియామకం
హైకోర్టు ఉత్తర్వులకూ వక్రభాష్యం
రేణిగుంట సబ్ రిజిస్ట్రార్‌పై తీవ్ర ఆరోపణలు
విచారణ చేసి సస్పెండ్ చేసిన ప్రభుత్వం
హైకోర్టుకు వెళ్లి ఊరట పొందిన అధికారి
మళ్లీ రేణిగుంటలోనే పోస్టింగ్‌కు పావులు
ఫైలుపై ‘నో’ అని మంత్రి రాసినా..ఇన్‌చార్జి డీఐజీ ద్వారా అదేచోట పోస్టింగ్
రిజిస్ట్రేషన్ల శాఖలో ఏం జరుగుతోంది? ప్రభుత్వ స్థాయిలో ఆ శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గొప్పా? లేక... ఒక చిన్న జిల్లా అధికారే సర్వస్వమా? ఇప్పుడు ఆ శాఖలో ఇదే చర్చ జరుగుతోంది. ఒక అధికారిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలు, అభియోగాల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి.. తిరిగి నియమించాలన్న ఫైలును రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి, స్పెషల్ సీఎ్‌సలు తిరిస్కరించారు. కానీ... రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా డీఐజీగా ఉన్న అధికారి మాత్రం పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. అది కూడా... హైకోర్టు ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి కోరుకున్న చోటే పోస్టింగ్ ఇచ్చారు. పైఅధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉంటే చాలు... మంత్రి, స్పెషల్ సీఎస్, ప్రభుత్వంతో పనేముందన్నట్లుగా తెగించేశారు.
ఆనందరెడ్డి అంటే మజాకా?
తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చాలా ఫేమస్. ఇక్కడి ఆఫీసుపై లెక్కలేనన్ని ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ సబ్‌రిజిస్ట్రార్‌గా ఆనంద రెడ్డి అనే ఓ అధికారి పనిచేస్తున్నారు. నిషేధ భూముల జాబితాలో ఉన్న భూములను ఈయన రిజిస్టర్ చేశారంటూ ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ చేసిన ప్రభుత్వం... ఆనంద రెడ్డిని ఈనెల 11వ తేదీన సస్పెండ్ చేసింది. ఆ వెంటనే ఆయన హైకోర్టుకు వెళ్లి సస్పెన్షన్‌ను సవాల్ చేసి... ఊరట పొందారు. సస్పెన్షన్ ఉత్తర్వును పక్కనపెడుతూ ఈనెల 20వ తేదీన హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతే తప్ప తిరిగి అదే రేణిగుంటలో సబ్ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్ ఇవ్వమని ఆదేశించలేదు. ఇలా ఉత్తర్వులు రావడమే ఆలస్యం... అలా అదే రోజున ఆనందరెడ్డి జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ల శాఖ హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లాలి. ఇది ఆ శాఖ కమిషనర్ (ఐజీ) చేయాల్సిన పని ఇది. కానీ, ఆ పనిచేయలేదు. ఇది ఆనందరెడ్డికి అందించిన లేదా అందివచ్చిన అవకాశం. ఇది అంతటితో ఆగలేదు. ఆనంద రెడ్డిని రేణిగుంట సబ్ రిజిస్ట్రార్‌గా నియమించాలంటూ ఐజీయే స్పెషల్ సీఎ్‌సకు ఈనెల 24న ఫైలు పెట్టారు. ఆ ఫైలుపై స్పెషల్ సీఎస్ వాస్తవాలు రాస్తూ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు పంపించారు. ఆనంద రెడ్డిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి అనగాని ఈనెల 26న ఫైలును తిరస్కరించారు. ఇదే ఫైనల్! అంటే... ఆయనకు రేణిగుంటలో కాకుండా మరోచోట పోస్టింగ్ ఇవ్వాలి. కానీ... ఇక్కడ అలా జరగలేదు.
‘ఇన్‌చార్జి’తో ఇలా...
ఆనందరెడ్డి పోస్టింగ్‌పై ఒక ఫైలు సచివాలయంలో ఫైలు నడుస్తుండగా, మరోవైపు అదే ఆనంద రెడ్డికి రేణిగుంటలోనే పోస్టింగ్ ఇచ్చేలా రిజిస్ట్రేషన్ శాఖలో కథ నడిచింది. ఆ సమయంలో చిత్తూరు డీఐజీ సెలవులో ఉండటంతో... నెల్లూరు డీఐజీకి చిత్తూరు బాధ్యతలనూ ‘ఇన్‌చార్జి’ హోదాలో అప్పగించారు. ఆనందరెడ్డికి రేణిగుంట పోస్టింగ్ ఇవ్వాలనే ఫైలు ఆయనకే వెళ్లింది. తెరవెనక ఏం జరింగిందో తెలియదు కానీ, ఆనందరెడ్డిని రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌గా డిప్యుటేషన్‌పై నియమిస్తూ చిత్తూరు ఇన్‌చార్జి డీఐజీగా ఉన్న నెల్లూరు డీఐజీ 27వ తేదీన ఆదేశాలు ఇచ్చారు. సరిగ్గా ఒకరోజు ముందు సచివాలయ స్థానంలో మంత్రి జారీ చేసిన ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా... మరుసటి రోజునే పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఇంకా చెప్పాలంటే, మంత్రి అనుమతి ఎవరికి కావాలన్నట్లుగా తీసిపారేసి ఓ జూనియర్ అధికారి అయిన డీఐజీతో పోస్టింగ్ ఆర్డర్ ఇప్పించారు. అదీ రెగ్యులర్ డీఐజీ లేని సమయంలో మరో జిల్లా అధికారికి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించి మరీ ఉత్తర్వులు ఇప్పించారు. ఆనందరెడ్డి కళ్లల్లో ఆనందం రెట్టింపవడానికి రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, స్పెషల్ సీఎ్‌సను తోసిరాజని మరీ నిర్ణయాలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ ఐజీ, డీఐజీలు అనుకుంటే ఏదైనా జరిగిపోతుందని... మంత్రి, సీనియర్ ఐఏఎస్ అయిన స్పెషల్ సీఎ్‌సలతో పనేలేదని ఈ ఉదంతం నిరూపిస్తోంది.
ఇంత తెగింపా?
రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డిపై వచ్చిన ఆరోపణలు చిన్నవో, సాధారణమైనవో కావు. నిషేధ జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు తీవ్రమైనవి కాబట్టే ప్రభుత్వం విచారణ చేసి మరీ సస్పెండ్ చేసింది. అలాంటి అధికారికి పోస్టింగ్ వద్దని ప్రభుత్వం ఫైలును తిరస్కరించినా పట్టుబట్టి మరీ ఉత్తర్వులు ఇప్పించారంటే ఇది దుస్సాహసమే అని సీనియర్ ఐఏఎ్‌సలు చెబుతున్నారు. తమకంటే ప్రభుత్వం ఎక్కువ కాదనేలా వ్యవహరించడం బరితెగింపునకు పరాకాష్ఠ అని ఓ సీనియర్ ఐఏఎస్ విస్మయం వ్యక్తం చేశారు.
షాక్‌లో మంత్రి...
తను ఫైలు తిరస్కరించినా ఆనందరెడ్డికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడటం పట్ల రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ షాక్‌నకు గురయ్యారని తెలిసింది. ‘మేం తిరస్కరించిన తర్వాత మళ్లీ నియామక ఉత్తర్వులు ఇచ్చారా? ఇదెలా సాధ్యమయింది?’ అంటూ మంత్రి విస్మయానికి గురయినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్-ఐజీ, ఇన్‌చార్జి చిత్తూరు డీఐజీని పిలిపించి మాట్లాడాలని ఆయన నిర్ణయించారు. ఆనందరెడ్డి పోస్టింగ్ ఉత్తర్వులను రద్దుచేయాలని డీఐజీని ఆదేశించినట్లు కూడా తెలిసింది.