Share News

Police Corruption: తాళాలు కావాలా రూ.50 వేలు ఇవ్వు

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:40 AM

సీజ్‌ చేసిన దుకాణం తాళాలు ఇవ్వడానికి యజమాని నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ అనకాపల్లి పట్టణ ఎస్‌ఐ ..

Police Corruption: తాళాలు కావాలా రూ.50 వేలు ఇవ్వు

  • సీజ్‌ చేసిన దుకాణం తాళాలు ఇచ్చేందుకు యజమాని నుంచి లంచం

  • 8ఏసీబీ వలలో అనకాపల్లి ఎస్‌ఐ

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సీజ్‌ చేసిన దుకాణం తాళాలు ఇవ్వడానికి యజమాని నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ అనకాపల్లి పట్టణ ఎస్‌ఐ దాసరి ఈశ్వరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఎస్‌ఆర్‌జే అప్పారావుకు మెయిన్‌రోడ్డులోని చిననాలుగురోడ్ల జంక్షన్‌ సమీపంలో ఒక దుకాణం ఉంది. పశ్చిమ బంగకు చెందిన నలుగురు యువకులు ఈ ఏడాది మే నెలలో ఆ దుకాణాన్ని అద్దెకు తీసుకున్నారు. జూలై 16న ఆ నలుగురు అద్దెకు తీసుకున్న దుకాణం పక్కనున్న నగల దుకాణంలో చోరీకి యత్నించి విఫలం కావడంతో పరారయ్యారు. ఫిర్యాదు అందడంతో పట్టణ పోలీసులు దుకాణ యజమాని అప్పారావును పిలిపించారు. ఎస్‌ఐ ఈశ్వర రావు.. షాపు తాళాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 2న అప్పారావును తన నివాసానికి పిలిచి తాళాలు తిరిగి ఇచ్చేందుకు, చోరీ యత్నం కేసులో పేరు రాకుండా చూడడానికి రూ.50 వేలు లంచం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు. దీనిపై అప్పారావు బుధవారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం ఎస్‌ఐ ఇంటికి వెళ్లి లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈశ్వరరావును అరెస్టు చేశామని, శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.

Updated Date - Aug 15 , 2025 | 04:40 AM