Share News

కోలుకోలేని దెబ్బ!

ABN , Publish Date - Nov 26 , 2025 | 01:24 AM

ఇటీవల వచ్చిన మొంథా తుఫాను అరటి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. కష్టపడి పండించిన పంట చేతికి అందివచ్చే వేళ తోటలను సర్వనాశనం చేసింది. అపార నష్టం కలుగజేసింది. ఎక్కడికక్కడ కూలిపోయిన చెట్లను తొలగించి భూమిని మరో పంటకు సిద్ధం చేసుకునేందుకు అన్నదాతలు నేడు వ్యయ ప్రయాశ పడాల్సి వస్తోంది. ఒక్కో ఎకరానికి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల సాయం సరిపోదని, మరింత పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

కోలుకోలేని దెబ్బ!

- మొంథా తుఫానుతో అరటికి అపార నష్టం

- జిల్లాలో 2,500 హెక్టార్లలో సాగు

- గెలలు తయారై కోతకు సిద్ధమైన తరుణంలో వచ్చిన తుఫాను

- కూలిపోయిన చెట్లు.. తొలగించేందుకు నేడు తప్పని వ్యయం

- ఒక్కో ఎకరానికి మొత్తంగా రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు

- ప్రభుత్వం ప్రకటించిన సాయం రూ.10 వేలే..

- దిక్కుతోచని స్థితిలో రైతన్నలు

ఇటీవల వచ్చిన మొంథా తుఫాను అరటి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. కష్టపడి పండించిన పంట చేతికి అందివచ్చే వేళ తోటలను సర్వనాశనం చేసింది. అపార నష్టం కలుగజేసింది. ఎక్కడికక్కడ కూలిపోయిన చెట్లను తొలగించి భూమిని మరో పంటకు సిద్ధం చేసుకునేందుకు అన్నదాతలు నేడు వ్యయ ప్రయాశ పడాల్సి వస్తోంది. ఒక్కో ఎకరానికి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే రూ.10వేల సాయం సరిపోదని, మరింత పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

కృష్ణానది తీరం వెంబడి ఉన్న తోట్లవల్లూరు, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ తదితర మండలాల్లో సుమారు 2,500 హెక్టార్లకు పైగా అరటి సాగు చేశారు. గత అక్టోబరులో సంభవించి మొంథా తుఫాను కారణంగా గంటకు 90 కిలో మీటర్ల వేగంగా గాలులు వీచాయి. దీంతో అరటి గెలలు తయారయ్యే దశలో ఉన్న అధిక శాతం తోటలు నిలువునా కూలిపోయాయి. కూలిన చెట్లను నరికించేందుకు ఎకరానికి రూ.12వేల వరకు కూలీలు తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. ముక్కలుగా నరికిన అరటి చెట్లను ట్రాక్టర్ల ద్వారా దూర ప్రాంతానికి తరలించేందుకు ఎస్కవేటర్‌, ట్రాక్టర్లకు కలిపి మరో నాలుగైదువేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని అంటున్నారు. అరటి చెట్లను మొదలుతో సహా తొలగించి వేరే పంటలు సాగు చేసేందుకు అనుకూలంగా మార్చేందుకు దుక్కి ఖర్చులు మరో రూ.పది వేల వరకు అవుతున్నాయని చెబుతున్నారు. ఎకరం అరటి తోటను పూర్తిగా తొలగించి వేరే పంటల సాగుకు అనుకూలంగా భూమిని మార్చడానికి కనీసంగా ఎకరానికి రూ.25వేల ఖర్చు అవుతోందని రైతుల మాటగా ఉంది.

కౌలు రూ.40 వేలపైనే..

అరటి తోటలు సాగు చేసే రైతుల్లో అధికంగా కౌలు రైతులే ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో భూమి సారాన్ని బట్టి ఎకరం అరటి తోటకు కౌలుగా రూ.40 వేల నుంచి రూ.55 వేల వరకు ముందస్తుగానే చెల్లించాల్సి ఉంటుంది. అరటి తోట గెలలు తయారయ్యి, కోత దశకు చేరేనాటికి ఎకరానికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడిగా పెట్టారు. తుఫాను కారణంగా తోటలు నేలవాలడంతో ఈ పెట్టుబడి మొత్తం నష్టపోయామని రైతులు వాపోతున్నారు. అరటి గెలలు తయారయ్యే సమయంలో చెట్లు పడిపోకుండా వెదురు వాసాలు కూడా పెట్టామని, ఒక్కో వాసం ఖరీదు వంద రూపాయల నుంచి రూ.120 వరకు ఉంటుందని, బలమైన గాలులు వీయడంతో అరటి చెట్లతో పాటూ వాసాలు కూడా విరిగిపోయాయని అంటున్నారు. ఎకరానికి 750 నుంచి 800 వరకు అరటి చెట్లు పెడతామని, ఇవన్నీ పడిపోవడంతో పెట్టుబడి, రాబడి, చెట్ల తొలగింపు తదితర పనులతో కలుపుకుని రూ.1.75 లక్షలు మేర నష్టం వాటిల్లిందని రైతులు కన్నీరు పెడుతున్నారు. పంట రూపంలో నష్టపోయిన నగదును మళ్లీ రాబట్టుకోవాలంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే రెండు, మూడు సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. కూర అరటి సాగు చేసిన పొలాల్లోని అరటి తోటలు కూడా పడిపోయాయని, ఆ చెట్ల గెలలకు ఉన్నకాయలు పూర్తిగా తయారు కాలేదని, దీంతో వీటికి మార్కెట్‌లో సరైన ధర లభించలేదని అంటున్నారు.

ఎకరానికి ఇచ్చే పరిహారం రూ.10 వేలే..

వాణిజ్య పంట అయిన అరటి తోటల సాగుకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎకరానికి కేవలం రూ.10 వేలు మాత్రమేనని రైతులు, అధికారులు చెబుతున్నారు. వరి పంటకు ఎకరానికి రూ.40 వేలు ఖర్చవుతుందని, అరటి సాగుకు రూ.60 వేల నుంచి రూ.70వేల వరకు పెట్టుబడిగా పెట్టాలని, కానీ వరి పంట మాదిరిగానే అరటి తోటలకు ఎకరానికి రూ.10వేలు మాత్రమే పరిహారం నిర్ణయించడం ఎంతవరకు సబబు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. పరిహారాన్ని పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పది ఎకరాల్లో నష్టం

మోపిదేవి మండలంలోని మోపిదేవి వార్పు, బొబ్బర్లంక గ్రామాల్లో కరకట్ట వెంబడి 10 ఎకరాల్లో అరటి తోటలు సాగు చేశా. మొంథా తుఫాను కారణంగా కోతకు గెలలు తయారైన తోటల్లో అరటి చెట్లు కూలిపోయాయి. ఎకరానికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడిగా పెట్టా. పంటను పూర్తిగా నష్టపోయా. ఈ నష్టం ఇలా ఉంటే కూలిన అరటి చెట్లను తొలగించేందుకు, వేరే పంటకు భూమిని సిద్ధం చేసేందుకు ఎకరానికి కనీసంగా రూ.25 వేల ఖర్చు అవుతోంది. అరటి చెట్లను మొదలుతో సహా తొలగించేందుకు గుడివాడలో తయారు చేయించిన బనానా ట్రీ కట్టర్‌ను ట్రాక్టరుకు బిగించి పనిచేయిస్తుంటే ట్రాక్టర్‌పై అదనపు లోడ్‌ పడుతోంది. తుఫాను కారణంగా అరటి పంటను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

-గద్దె శ్రీహరి, రైతు, మోపిదేవి

Updated Date - Nov 26 , 2025 | 01:24 AM