Share News

గంజాయిపై ఉక్కుపాదం

ABN , Publish Date - Aug 01 , 2025 | 01:13 AM

‘‘జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. విక్రయించే వారిపైనే కాదు.. తాగే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసుల ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారింది. లోక్‌ అదాలత ద్వారా 4,346 కేసులను పరిష్కరించాం. రాష్ట్రంలోనే జిల్లాను మూడో స్థానంలో నిలబెట్టాం’’ అని జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు అన్నారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

గంజాయిపై ఉక్కుపాదం

- విక్రయించేవారితో పాటు తాగే వారిపైనా కఠిన చర్యలు

- కేసుల ఛేదనలో కీలకంగా సాంకేతిక పరిజ్ఞానం

- సీసీ కెమెరాలకు చిక్కుతున్న నిందితులు

- లోక్‌ అదాలత ద్వారా 4,436 కేసులకు పరిష్కారం

- రాష్ట్రంలో మూడో స్థానంలో జిల్లా

- ‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు

‘‘జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. విక్రయించే వారిపైనే కాదు.. తాగే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసుల ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారింది. లోక్‌ అదాలత ద్వారా 4,346 కేసులను పరిష్కరించాం. రాష్ట్రంలోనే జిల్లాను మూడో స్థానంలో నిలబెట్టాం’’ అని జిల్లా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు అన్నారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం క్రైమ్‌:

జిల్లాలో గంజాయి అమ్మకాలు, కొనుగోళ్లపై నిఘా పెట్టాం. అమ్మేవారిని గుర్తించి కఠిన సెక్షన్ల్‌ కింద కేసులు నమోదు చేస్తున్నాం. అయినా తీరుమారకుంటే వారి ఆస్తులను జప్తు చేసేందుకు కూడా వెనకాడబోం. ముఖ్యంగా వీరికి గంజాయి ఎక్కడ నుంచి వస్తుందన్న వివరాలు సేకరిస్తున్నాం. తెచ్చే వారిని కూడా అరెస్టు చేసి గంజాయి రహిత జిల్లాగా మార్చుతాం. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మత్తుకు బానిస అయిన వారిని రిహాబిలిటేషన్‌ సెంటర్ల ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చు. ఏడాదిలో 3,737కిలోల గంజాయి, 4.22 కిలోల లిక్విడ్‌ గంజాయిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశాం. అక్రమ మద్యం 15,280 బాటిళ్లు, 684 లీటర్ల సారాను ధ్వంసం చేశాం.

మహిళల భద్రతకు ప్రాధాన్యం

మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. గత నవంబర్‌లో ఆరు శక్తి టీమ్‌లను ఏర్పాటు చేశాం. 28 మంది శిక్షణ పొందిన మహిళా సిబ్బందిని మోటార్‌ సైకిళ్లపై పహారాకు నియమించాం. కాలేజీలు, మార్కెట్లు, బస్‌స్టేషన్లు హాట్‌స్పాట్‌లుగా గుర్తించి ఈవ్‌టీజింగ్‌ను అరికట్టగలిగాం. గృహహింస, ఈవ్‌టీజింగ్‌, స్టాకింగ్‌ వంటి కేసుల్లో తక్షణ చర్యలు తీసుకోవటం ద్వారా నేరం జరిగే తీవ్రతను తగ్గించగలిగాం. వేగంగా స్పందించటంతో మహిళల్లో భద్రతా భావనను పెంపొందించాం. జిల్లాలో శక్తి యాప్‌ను 5.32 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం ద్వారా విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం.

సాంకేతికతతో కేసుల ఛేదన

కేసుల ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోంది. పెనమలూరు డబుల్‌ మర్డర్‌ కేసులో టవర్‌ డంప్‌ సీసీటీవీ ఆధారాలతో నిందితులను అరెస్టు చేయగలిగాం. చల్లపలి హత్య కేసులో పొటాషియం సైనైడ్‌ వాడిన నిందితులను సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నాం. సీసీ కెమెరాల ద్వారా బైక్‌ దొంగలను పట్టుకుని 70 లక్షల విలువైన 90 వాహనాలను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించాం.

పటిష్ట నిఘా

జిల్లా వ్యాప్తంగా 4,040 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రజా ప్రదేశాల్లో 2,550, ఆలయాల్లో 407, చర్చిల్లో 247, మసీదుల్లో 74 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. డ్రోన్‌ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిఘా మరింత సులభతరం అయ్యింది. పబ్లిక్‌ మీటింగ్‌, వీఐపీ పర్యటనలు, పండగలు, అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్‌లను వినియోగిస్తున్నాం. ఎన్‌ఏటీ గిడ్‌ ద్వారా 123 కేసులను వేగవంతంగా ఛేదించగలిగాం. చోరీకి గురైన 702 మొబైల్‌ ఫోన్‌లను ఎంఎంటీఎస్‌ సహాయంతో స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించాం.

కీలకమైన కేసుల్లో శిక్షలు పడేలా కృషి

2024-25లో వివిధ నేరాలకు సంబంధించి 220 తీర్పులు వచ్చాయి. హత్యలు, పోక్సో కేసులకు సంబంధించి సమగ్ర ఆధారాలను సమర్పించటంతో చాలామందికి కోర్టులు జీవిత ఖైదు విధించాయి. కొంత మందికి 20 ఏళ్ల పైబడి శిక్షలు పడ్డాయి. కోర్టు మానిటరింగ్‌ సిష్టం పటిష్ట పరచటం ద్వారా నేరాలను చేసిన వారికి శిక్షలు త్వరితగతిన వేయించగలిగాం. లోక్‌ అదాలత ద్వారా 4,436 కేసులు పరిష్కరించి రాష్ట్రంలో మూడో స్థానంలో జిల్లాని నిలబెట్టాం.

సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట

సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. 244 మంది బదిలీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాం. వారి వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరిస్తున్నాం. వార్షిక క్రీడలు, ఆరోగ్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది తాలూకు రావలసిన ఎరియర్స్‌ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నాం. కారుణ్య నియామకాల విషయంలో త్వరిత గతిన స్పందించటం ద్వారా వారికి న్యాయం చేస్తున్నాం. రిటైర్‌ అయిన సిబ్బందికి అందవలసిన ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Aug 01 , 2025 | 01:13 AM