అన్నదాతకు ఆధార్ తరహా గుర్తింపు సంఖ్య
ABN , Publish Date - Aug 20 , 2025 | 11:59 PM
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆధార్ కార్డు ఇచ్చినట్లుగానే అన్నదాతలకు ప్రత్యేకంగా ఒక విశిష్ట గుర్తింపు పత్రం ఇచ్చేందుకు సమాయత్తమైంది.
వీటి ద్వారానే అన్ని పథకాలు అమలు
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆధార్ కార్డు ఇచ్చినట్లుగానే అన్నదాతలకు ప్రత్యేకంగా ఒక విశిష్ట గుర్తింపు పత్రం ఇచ్చేందుకు సమాయత్తమైంది. గత సంవత్సరం ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖలు ప్రారంభించాయి. ప్రస్తుతం ఆధార్‌తో సేవలను తరుచు ప్రతి పౌరుడు ఎలా అందుకుంటున్నారో.. అదే రీతిలో రైతు విశిష్ట సంఖ్య గుర్తింపు పత్రంతో ప్రభుత్వం అమలు చేసే పథకాలను పొందగలరనీ వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరున్నరలక్షల మంది రైతులు ఉండగా.. ఇప్పటికే 5 లక్షల మందికి విశిష్ట గుర్తింపు కార్డు జారీ ప్రక్రియ పూర్తయింది. రైతుకు ఒక విశిష్ట సంఖ్య ఇవ్వాలని సంకల్పించిన భారత ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఈ కార్యక్రమం ప్రగతి గురించి వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన రైతు సేవా కేంద్రాల్లో పని చేసే వ్యవసాయ ఉద్యాన సహాయకులతో నమోదు ప్రక్రియను చేపట్టారు. ప్రధానమంత్రి కిసాన యోజన కింద లబ్ది పొందే రైతు కుటుంబాల ఆధారంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. రైతు రిజిస్ర్టేషన చేయించుకున్న సమయంలోనే రైతు సెల్‌కు పంపిన సంఖ్య తాత్కాలికమే అయినప్పటికీ ఆ తర్వాత భారత ప్రభుత్వం జారీ చేసే సంఖ్య విశిష్ట సంఖ్య కానుంది. ఆ సమయంలోనే రైతుకు ఒక గుర్తింపు పత్రం కూడా జారీ చేస్తారు. సొంత భూమి కలిగిన రైతులకు ఈ సంఖ్య జారీ అవుతుంది. ఆ విశిష్ట గుర్తింపు కార్డులో సాగు భూమి వివరాలు, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌కార్డు, సెల్ నెంబర్ తదితర ఆధారాలతో వ్యవసాయ శాఖ సహాయకులను కలిసినప్పుడు నమోదు చేసి ఇటీవల ఒక సంఖ్యను రైతు సెల్‌ఫోనకు పంపారు. ప్రభుత్వం రైతులకు అమలు చేసే వివిద పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా, పెట్టుబడి రాయితీ, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పచ్చిరొట్టె విత్తనాలు, భూసార పరీక్షలు, వర్షాలు ఆయా సీజన్లలో ఎంత మొత్తంలో కురిసేది, మార్కెటింగ్ శాఖలో వసతులు ప్రయోజనాలు ఇలా అనేక రకాల పథకాలు, కార్యక్రమాలు రైతుకు అందాలంటే ఇకపై ఈ విశిష్ట సంఖ్యనే ఆధారం కానుంది.