Minister Bala Veeranjaneya Swamy: పేద విద్యార్థుల కలల సాకారానికి స్టడీ సర్కిళ్లు
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:57 AM
ఐఏఎస్ కావాలన్న పేద విద్యార్థుల కలను సాకారం చేసేందుకే అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నాం అని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు.
340 మందికి సివిల్స్‌లో ఉచిత శిక్షణ: మంత్రి డోలా
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘ఐఏఎస్ కావాలన్న పేద విద్యార్థుల కలను సాకారం చేసేందుకే అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నాం’ అని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం విజయవాడ అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ ఉచిత శిక్షణను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘గత వైసీపీ ప్రభుత్వం అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లను నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతిలోని అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లలో 340 మందికి సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌తో పాటు భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తున్నాం. విశాఖ కేంద్రంగా రాష్ట్రంలోని అభ్యర్థులందరికీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది’ అని తెలిపారు. కాగా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, అంబేడ్కర్ గురుకులాల విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతపై రాజీపడొద్దని మంత్రి డోలా సంబంధిత అధికారులను ఆదేశించారు.
జంబోరి డైమండ్ జూబ్లీ విజేతలకు అభినందనలు
లక్నోలో నవంబరు 23 నుంచి 29 వరకు జరిగిన 19వ జాతీయ జంబోరి డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొని బ్యాండ్, మార్చ్‌ఫాస్ట్, క్యాంప్ క్రాఫ్ట్ పోటీల్లో జాతీయ స్థాయిలో మూడో స్థానం సాధించిన తాడేపల్లిగూడెం కడకట్ల అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను మంత్రి డోలా అభినందించారు. మంగళవారం సచివాలయంలో గురుకుల ప్రిన్సిపాల్ రాజారావు ఆధ్వర్యంలో విద్యార్థులు మంత్రిని కలిశారు.