Amazon Expands Development Center: విశాఖలో అమెజాన్ విస్తరణ..!
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:40 AM
అమెజాన్ సంస్థ విశాఖపట్నంలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ-కామర్స్ వ్యవహారాల కోసం రెండేళ్ల క్రితం పెందుర్తి సమీపాన గుర్రంపాలెంలో తన డెవల్‌పమెంట్ సెంటర్‌ను ప్రారంభించింది....
ఇప్పటికే ఈ-కామర్స్ డెవల్‌పమెంట్ సెంటర్
దానిని విస్తరించనున్నట్టు ఎస్‌టీపీఐకి వెల్లడి
ఐటీపై దృష్టి సారించినట్టు సమాచారం
850 మందికి ఉద్యోగ అవకాశాలు
విశాఖపట్నం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): అమెజాన్ సంస్థ విశాఖపట్నంలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ-కామర్స్ వ్యవహారాల కోసం రెండేళ్ల క్రితం పెందుర్తి సమీపాన గుర్రంపాలెంలో తన డెవల్‌పమెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. సుమారు 400 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ లైసెన్స్ కాలపరిమితి ముగిసిపోవడంతో వారం క్రితం విశాఖపట్నంలోని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎ్‌సటీపీఐ) వద్ద లైసెన్స్ రీ రిజిస్టర్ చేసింది. ఇక్కడి డెవల్‌పమెంట్ సెంటర్‌ను విస్తరించనున్నామని పేర్కొంది. ఐటీ, సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్‌పై దృష్టి సారించనున్నట్టు తెలిసింది. హై స్కిల్డ్ ఉద్యోగులను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. రాబోయే మూడేళ్లలో రూ.9,740 కోట్ల ఎగుమతులు చేయాలనే లక్ష్యంతో 850 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఐటీ వర్గాలు తెలిపాయి.
భారీగా ప్రణాళికలు
అమెజాన్ సంస్థ ఇండియాలో రాబోయే ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. అంటే ఏడాదికి రూ.60 వేల కోట్ల చొప్పున వెచ్చిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ప్రస్తుతం విశాఖలో 400 మంది అమెజాన్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. ఇక్కడ డెవల్‌పమెంట్ సెంటర్‌ను భారీగా విస్తరించనున్నారు.
- ఓ.నరేశ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్,
రుషికొండ ఐటీ పార్క్ అసోసియేషన్