Minister Narayana: డిసెంబరుకు అమరావతిలో టవర్ల నిర్మాణాలు పూర్తి
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:55 AM
రాజధాని అమరావతిలోని అన్ని టవర్ల నిర్మాణాన్ని డిసెంబరు 31లోగా పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక...
వచ్చే మార్చి నాటికి అధికారులకు ఇళ్లు అప్పగింత: మంత్రి నారాయణ
తుళ్లూరు, సెప్టెంబరు 7(ఆంధ్ర జ్యోతి): రాజధాని అమరావతిలోని అన్ని టవర్ల నిర్మాణాన్ని డిసెంబరు 31లోగా పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. ఆదివారం నేలపాడులో పనుల పురోగతిపై సీఆర్‌డీఏ ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంతోపాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అమరావతిలో గెజిటెడ్, గ్రూప్-డి అధికారుల కోసం మొత్తం 14 టవర్లలో 1440 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. టైప్ -1 లో 384 ఇళ్లు, టైప్-2 లో 336 ఇళ్లు, గ్రూప్-డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. రోడ్లు, డ్రెయిన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. మొత్తం 4,400 ఇళ్లలో 3,750 ఇళ్లను వచ్చే మార్చి నాటికి అధికారులకు, ఉద్యోగులకు అప్పగిస్తామని చెప్పారు. ట్రంక్ రోడ్లు ఏడాదిలో, రైతుల లే అవుట్ రోడ్లు రెండున్నరేళ్లలో, ఐకానిక్ టవర్లను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. అమరావతి గురించి ఏసీ రూములో కూర్చుని కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో మిగిలిన కొద్ది భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు అథారిటీ ఆమోదించిందన్నారు. భూసేకరణ కంటే, భూసమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభం ఉంటుందని చెప్పారు.