AP CM Chandrababu Naidu: అమరావతిలో సాంస్కృతిక కేంద్రం
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:42 AM
రాజధాని అమరావతి ప్రాంతంలో ఆధునిక సౌకర్యాలతో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు.
గడువులోగా క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్
రైతుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి
పర్యాటకులను ఆకట్టుకునేలా గ్రీనరీ, పార్కులు
సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సీఎం ఆదేశాలు
103 కోట్లతో క్వాంటమ్ వ్యాలీ ప్రత్యేక భవనం
443 కోట్లతో వరద పంపింగ్ స్టేషన్లు
లేఅవుట్లలో 1,358 కోట్లతో సదుపాయాలు
పలు అంశాలకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం
అమరావతి/గుంటూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ప్రాంతంలో ఆధునిక సౌకర్యాలతో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన 56వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ఆమోదించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన విషయాలపై సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాజధాని ప్రాంతంలో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం అమరావతిలో ఇప్పటికే ఒక వేదిక నిర్మించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించాలన్నారు. ఆ కేంద్రానికి ఏపేరు పెడితే బాగుంటుందో కూడా ఆలోచించాలని చెప్పారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సాంస్కృతిక కేంద్రం నిర్మాణ చేపట్టాలన్నారు. భూములిచ్చిన రైతులకు కేటాయించే ప్లాట్ల లేఅవుట్ల వద్ద పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రాజధాని రైతుల సమస్యలను ఏవిధమైన జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో హోటళ్లు ఉండేలా చూడాలని, వాటి నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఎస్ విజయానంద్‌తో పాటు సీఆర్‌డీఏ, ఏడీసీ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
క్వాంటమ్ వ్యాలీలో ప్రత్యేక భవనాలు
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎక్వి్‌పమెంట్ కోసం ఒక ప్రత్యేక భవన నిర్మాణానికి సీఆర్‌డీఏ అథారిటీ నిర్ణయించిందని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు. సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 103.96 కోట్ల అంచనాతో దీనికి టెండర్లు పిలిచి ఎల్-1ను ఖరారు చేశామన్నారు. క్వాంటమ్ వ్యాలీలో మరో రెండు భవనాల నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. సీఆర్‌డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. ‘‘అఖిలభారత సర్వీసు అధికారుల నివాసాల అంతర్గత సదుపాయాల పనుల కోసం రూ.109 కోట్ల విడుదలకు అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతి నిర్మాణానికి నాబార్డ్ మంజూరు చేసిన రూ. 7,500 కోట్లలో రూ. 1,502 కోట్లు విడుదల చేశాం. వాటిలో రూ. 100 కోట్లు సీఆర్‌డీఏ, అమరావతి డెవల్‌పమెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయానికి అనుమతి ఇచ్చాం. ఆసుపత్రి, యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్ర ఆయుష్ శాఖకు 60 ఏళ్లపాటు ఎకరం రూపాయి చొప్పున 23 ఎకరాలు శాఖమూరులో లీజుకు ఇవ్వాలని ఉపసంఘం తీసుకున్న నిర్ణయానికి అథారిటీ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఆయుష్ శాఖ రూ. 750 కోట్లు ఖర్చు చేస్తుంది. అమరావతిని వరద నివారణకు నెదర్లాండ్స్ సంస్థతో డిజైన్స్ రూపొందించాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్‌తో పాటు 6 రిజర్వాయర్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రతిపాదించాం. ఇవి కాకుండా అధికంగా వచ్చే వరద ముప్పు నుంచి రక్షణగా మరో 22,500 క్యూసెక్కుల నీటిని బయటకు పంపడానికి చర్యలు తీసుకుంటున్నాం.
కొత్తగా గుంటూరు చానల్ ద్వారా 4 వేల క్యూసెక్యులు బయటకు పంపేలా పంపింగ్ స్టేషన్ నిర్మిస్తాం. ఇప్పుడున్న పంపింగ్‌కు అదనంగా ఉండవల్లిలో మరో 8,500 క్యూసెక్కులు పంపింగ్ చేసే స్టేషన్‌ను రూ. 443.76 కోట్లతో ఏర్పాటు చేయడానికి అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధాని ఎల్‌పీఎస్ జోన్-8లో రూ. 1,358 కోట్లతో పనులను ఆమోదించాం. జరీబు, జరీబు కాని భూములపై రైతుల్లో నెలకొన్న అపోహలను తొలగించడానికి అధికారుల రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించాం. 2014 డిసెంబరు 8న తీసిన శాటిలైట్ చిత్రాల ఆధారంగా జరీబు భూములపై నిర్ణయం ఉంటుంది’’ అని తెలిపారు.
నేడు సీఎం క్వాంటమ్ టాక్
క్వాంటమ్ వ్యాలీతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. క్వాంటమ్ కంప్యూటింగ్‌పై టెక్ విద్యార్థులో అవగాహన పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకున్నారు. సాంకేతిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన క్వాంటమ్ టాక్ పేరిట మంగళవారం ఉదయం 9.30 గంటలకు వర్చువల్‌గా ప్రసంగిస్తారు. క్వాంటమ్ ఐటీ కంపెనీలు, క్యూబిట్, వైసర్ సంస్థలతో సంయుక్తంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ లెక్చర్ కోసం పదిరోజుల వ్యవధిలోనే 50 వేల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ విద్యా సదస్సులో డిజిటల్ మాధ్యమం ద్వారా భవిష్యత్తు సాంకేతిక నైపుణ్యాలు, క్వాంటమ్ కంప్యూటింగ్ దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్, భవిష్యత్తు లక్ష్యాలను సీఎం వివరించనున్నారు.ప్రతిభ చూపిన విద్యార్థులకు ఐబీఎం, సీడాక్, టీసీఎస్ వంటి సంస్థలు క్వాంటమ్ కంప్యూటింగ్, మిషన్ లెర్నింగ్‌లో శిక్షణను ఇవ్వనున్నాయి.