Share News

Quantum Computing: అమరావతిలో క్వాంటమ్‌ విలేజ్‌

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:55 AM

అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ నెలలో మొదలు పెట్టిన క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విలేజ్‌ నిర్మాణం, దేశంలోనే తొలిసారి ఇక్కడ స్థాపించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

Quantum Computing: అమరావతిలో క్వాంటమ్‌ విలేజ్‌

దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు.. 50 ఎకరాల్లో నిర్మాణం

టీసీఎస్‌, ఐబీఎం, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో అధికారుల భేటీ

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): అత్యాధునిక క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కేంద్రంగా అమరావతి మారడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. దేశంలోనే తొలి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విలేజ్‌ను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైటెక్‌ సిటీని తలదన్నేలా ఐకానిక్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విలేజ్‌ను రాజధానిలో నిర్మించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. మంగళవారం వెలగపూడి సచివాలయంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎంఓ కార్యదర్శి ప్రద్యుమ్న, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌, ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టి ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన 50 ఎకరాల్లో క్వాంటమ్‌ విలేజ్‌ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఈ విలేజ్‌ నిర్మాణంలో అత్యంత కీలకమైన ఐకానిక్‌ భవన నిర్మాణ డిజైన్‌ను అందించడానికి ఎల్‌అండ్‌టీ సంస్థ ముందుకొచ్చింది. అవసరమైన అత్యాధునికమైన కంప్యూటర్‌ సిస్టమ్‌లను ఐబీఎం అందించనుంది. ఇక్కడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్టేట్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ క్వాంటమ్‌ విలేజ్‌ దేశానికే గుర్తింపు తెచ్చే సాంకేతిక విజ్ఞాన కేంద్రంగా మారుతుందని అధికారులు చెప్పారు. ఈ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విలేజ్‌ పనులు వేగవంతం చేయాలని ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు.

Updated Date - Apr 23 , 2025 | 04:56 AM