Share News

Minister Narayana: మూడేళ్లలో అమరావతి

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:49 AM

అమరావతిలో పనులు జరగడం లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి అడ్డంకులు కల్పిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పారు.

Minister Narayana: మూడేళ్లలో అమరావతి

  • ఎవరెన్ని కుట్రలు చేసినా పూర్తి చేస్తాం

  • పనులు శరవేగంగా సాగుతున్నాయ్‌

  • అనుమానం ఉంటే క్షేత్రస్థాయికి రండి

  • వచ్చే మార్చి కి అధికారులు, ఉద్యోగుల క్వార్టర్లు రోడ్లు, డ్రైనేజీలు పూర్తికావొచ్చాయి: నారాయణ

తుళ్లూరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ‘అమరావతిలో పనులు జరగడం లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి అడ్డంకులు కల్పిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం’ అని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మంగళవారం రాజధాని నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. శాఖమూరు రిజర్వాయర్‌, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్‌తోపాటు అనంతవరం పార్కును మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరావతిలో పనులు జరగడం లేదని ఆరోపిస్తున్నవారు క్షేత్రస్థాయికి వచ్చి చూడాలన్నారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న టెండర్లు క్లోజ్‌ చేయడంతోపాటు ఇతర ఆర్థిక అంశాలను కొలిక్కితెచ్చాం. పాత నిర్మాణాలపై ఐఐటీ నిపుణులతో అధ్యయనం చేయించాం. ప్రస్తుతం రాజధానిలో అన్ని పనులూ ప్రారంభమయ్యాయి. వచ్చే మార్చి నెలాఖరుకు అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన 4 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. రోడ్లు, డ్రైనేజి పనులు దాదాపు పూర్తికావచ్చాయి. లేఅవుట్‌ రోడ్ల డిజైన్లను ఐఐటీ నిపుణులు ఈ నెలాఖరుకు ఫైనల్‌ చేస్తారు. రాజధానిలో వరద ముంపు నివారణ కోసం కాలువల డిజైన్లను నెదర్లాండ్స్‌ అధికారులతో చేయించాం. రాజధానిలో కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్‌ను 7.843 కిలోమీటర్లు తవ్వుతున్నాం. వీటితోపాటు శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండ రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం. వర్షాల కారణంగా కాలువ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆయా పనులు 2027 అక్టోబరులోగా పూర్తి చేయాలనుకున్నా.. ఏడాది చివరకు పూర్లయ్యేలా ఉన్నాయి’ అని మంత్రి నారాయణ చెప్పారు.


900 మంది రైతుల కౌలు పెండింగ్‌

రాజధానిలో సుమారు 25 వేల మందికి ఈ ఏడాది కౌలు నిధులు జమ చేయాల్సి ఉండగా, నిన్నటి వరకూ రకరకాల కారణాలతో ఏడు వేల మందికి జమ కాలేదన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న నిధులు కూడా అకౌంట్లలో జమ అయ్యాయని, ఇంకా 900 మందికి పెండింగ్‌ ఉన్నాయని మంత్రి చెప్పారు. కౌలు సొమ్ము జమకాని రైతులు వెబ్‌సైట్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ పర్యటనలో అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్ధసారథి, సీఆర్డీఏ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గోపాలకృష్ణారెడ్డి, సీఈ ధనుంజయ్‌, ఇంజనీర్లు, కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


చంద్రబాబుపై సింగపూర్‌కు నమ్మకం ఉంది

‘సీఎం చంద్రబాబుపై సింగపూర్‌ ప్రభుత్వానికి ఎంతో నమ్మకం ఉంది. గత ప్రభుత్వం సింగపూర్‌కు సీఐడీ అధికారులను పంపి, వారిపై విచారణ చేయించింది. ఆ ప్రభుత్వం ఎంతో బాధపడింది. దీనివల్ల సింగపూర్‌-ఏపీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ సంబంధాలను తిరిగి పునరుద్ధరించేందుకే సీఎం చంద్రబాబు సింగపూర్‌ వెళ్లారు. అక్కడ సింగపూర్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ మంత్రులను కలిశారు. అన్నివిధాలా సహకరిస్తామని వారు చెప్పారు. సీఆర్డీఏకు సహకరిస్తామని సింగపూర్‌ నేషనల్‌ పార్క్స్‌ అథారిటీ చెప్పింది. పది రోజుల్లో ఆ అథారిటీ సభ్యులు అమరావతి వస్తున్నారు’ అని మంత్రి నారాయణ తెలిపారు.

Updated Date - Aug 06 , 2025 | 04:49 AM