Share News

Amaravati moved closer to becoming a financial hub: అహో... అమరావతి!

ABN , Publish Date - Nov 29 , 2025 | 04:55 AM

రాజధాని అమరావతిలో ఆర్థిక నగరి ఏర్పాటు దిశగా తొలిఅడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా... ఒకే రోజున 15 బ్యాంకులు, ఎల్‌ఐసీ వంటి సంస్థల జోనల్‌ కార్యాలయాలు..

Amaravati moved closer to becoming a financial hub: అహో... అమరావతి!

  • ఆర్థిక నగరిగా అడుగులు

  • ఒకేచోట కొలువుతీరనున్న 13 బ్యాంకులు

  • ముంబై నుంచి తరలి వచ్చిన బ్యాంకింగ్‌ దిగ్గజాలు

(గుంటూరు - ఆంధ్రజ్యోతి)

రాజధాని అమరావతిలో ‘ఆర్థిక నగరి’ ఏర్పాటు దిశగా తొలిఅడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా... ఒకే రోజున 15 బ్యాంకులు, ఎల్‌ఐసీ వంటి సంస్థల జోనల్‌ కార్యాలయాలు, సర్కిల్‌ ఆఫీసులు, ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఎస్‌బీఐ చైర్మన్‌ శ్రీనివాసులుశెట్టితో సహా ఆయా బ్యాంకుల ఎండీలు, సీఎండీలు, ఉన్నతస్థాయి అధికారులు ముంబై నుంచి తరలి వచ్చారు. రాయపూడిలో ఇటీవల ప్రారంభించిన ఏపీసీఆర్డీఏ కార్యాలయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి పరిశీలించారు. ఆయా బ్యాంకులు, సంస్థల కార్యాలయాల శంకుస్థాపనకు సంబంధించిన ఉమ్మడి ఫలకాన్ని రిమోట్‌ ద్వారా ఆవిష్కరించారు. దీనిని ఆవిష్కరించాలని చంద్రబాబును ఆమె పదేపదే కోరినా ఆయన అంగీకరించకుండా... ఆమె చేతనే ఆవిష్కరింపచేశారు. ఎస్‌బీఐ ఎల్‌హెచ్‌వో భవన శంకుస్థాపన ఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఆ తర్వాత ఒక్కో బ్యాంకు, ఆర్థిక సంస్థల భవనాల ఫలకాలను ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ కార్యాలయాలు... కెనరా బ్యాంక్‌ సర్కిల్‌ ఆఫీస్‌, ఆప్కాబ్‌ ప్రధాన కార్యాలయం, ఇతర బ్యాంకులు రాష్ట్రస్థాయి కార్యాలయాలకు భూమిపూజ జరిగింది. ఆ బ్యాంకులు తమకు కేటాయించిన స్థలాలకు ఫెన్సింగ్‌ వేసి... తాము నిర్మించబోయే భవనాల నమూనాలతో ‘స్వాగత’ తోరణాలు ఏర్పాటు చేశాయి. దీంతో... ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతానికి ‘బ్యాంక్‌ స్ట్రీట్‌’ అని నామకరణం చేశారు. రాజధానిలో కార్యాలయాల శంకుస్థాపనకు వచ్చిన బ్యాంకుల ఉన్నతాధికారులకు సీఆర్డీయే అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. వీరిలో చల్లా శ్రీనివాసులు(ఎ్‌సబీఐ), సత్యన్నారాయణ రాజు(కెనరా బ్యాంకు), దేబదత్తా చాంద్‌ (బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా), రాకేశ్‌ శర్మ(ఐడీబీఐ),అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ(ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు), వినోద్‌ కుమార్‌(ఇండియన్‌ బ్యాంకు), ఆశిష్‌రెడ్డి(యూనియన్‌ బ్యాంక్‌), కల్యాణ్‌కుమార్‌ (సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా), అశోక్‌ చంద్ర (పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు), రజనీశ్‌ కర్నాటక్‌ (బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా), ప్రమోద్‌కుమార్‌రెడ్డి(ఏపీ గ్రామీణ్‌ బ్యాంకు), శ్రీనాథ్‌ రెడ్డి (ఆప్కాబ్‌), నాబార్డు ఎండీ షాజీ కేవీ, ఆర్‌ దొరైస్వామి(ఎల్‌ఐసీ), గిరిజ సుబ్రహ్మణియన్‌ (న్యూ ఇండియా ఎస్స్యూరెన్స్‌) ఉన్నారు.

ఎల్‌హెచ్‌వో విశేషాలు...

రాజధానిలో ఎస్‌బీఐ నిర్మించబోతున్న లోకల్‌ హెడ్‌ ఆఫీసు విశిష్టతలను నిర్మల సీతారామన్‌, చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రూ.311 కోట్ల అంచనా విలువతో... స్థానికత ఉట్టిపడే డిజైన్‌లో భవనాన్ని నిర్మించబోతున్నట్లు అధికారులు తెలిపారు. లక్ష చ.గ. విస్తీర్ణంలో 14 అంతస్తుల డిజైన్‌ని ఆమోదించామన్నారు. సాధ్యమైనంత త్వరగా టెండర్‌ ఖరారు చేసి ఏజెన్సీని ఎంపిక చేసి పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.

Updated Date - Nov 29 , 2025 | 04:55 AM