Share News

Amaravati Safe Despite Heavy Rains: సురక్షితంగా అమరావతి

ABN , Publish Date - Aug 15 , 2025 | 06:09 AM

అవునా.. రాజధాని అమరావతి మునిగిపోయిందా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకే ముంపునకు గురైందా..

Amaravati Safe Despite Heavy Rains: సురక్షితంగా అమరావతి

  • భారీ వర్షాల ప్రభావం అంతంతే

  • యథాతథంగా సాగుతున్న రాకపోకలు

  • కొనసాగుతున్న రాజధాని నిర్మాణ పనులు

  • వర్షాలకు రాజధాని మునిగిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం

(గుంటూరు-ఆంధ్రజ్యోతి): అవునా..? రాజధాని అమరావతి మునిగిపోయిందా? రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకే ముంపునకు గురైందా? సోషల్‌ మీడియాతో పాటు జగన్‌ రోతపత్రిక ఇలా దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. అమరావతిలో కీలక ప్రాంతాలన్నీ సురక్షితంగా ఉన్నాయి. యథాతథంగా రాకపోకలు కొనసాగుతున్నాయి. రాజధాని నిర్మాణ పనులూ జరుగుతున్నాయి. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, మందడం, నేలపాడు, లింగాయపాలెం, వెలగపూడి, రాయపూడి, దొండపాడు, ఉద్దండరాయునిపాలెం సహా అన్ని ప్రాంతాలు అత్యంత సురక్షితంగా ఉన్నాయి. వర్షాలకు సాధారణంగా వచ్చే నీటి మడుగులు తప్ప మరింకేమీ లేవు. పంటపొలాల్లో సైతం నీరు నిలవలేదు. కోర్‌ క్యాపిటల్‌లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అన్ని భవనాల వద్ద, రహదారుల వద్ద అక్కడక్కడ నీరు నిలిచిన జాడలు తప్ప మునిగిపోయిన దాఖలాలు కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పనులు చేపట్టిన కోర్‌ క్యాపిటల్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్ర స్థాయిలో పర్యటించింది.అమరావతిలో నుంచి ప్రవహించే కొండవీటి వాగు తాడికొండ దగ్గర కట్టతెగి పంటపొలాలపై విరుచుకుపడింది. కానీ అమరావతిలో ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు.


సీఆర్డీఏ కార్యాలయంలో..

రాజధానిలోని సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, ఏపీ సీఆర్డీఏ కార్యాలయం వద్ద చుక్కనీరు కూడా లేదు. గురువారం కార్మికులు చక్కగా పనులు కూడా చేసుకుంటున్నారు. సీఆర్డీఏ భవనానికి ఎదురుగా నిర్మిస్తున్న నాలుగు నిర్మాణాల వద్ద కూడా నీరు నిలవలేదు. నేలపాడు జంక్షన్‌లో నిర్మిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవన సముదాయం వద్ద కూడా చుక్క నీరు నిలవలేదు. సీడ్‌ యాక్సిస్‌ నుంచి హైకోర్టుకు వెళ్లే రహదారి, ఆ రోడ్డుకు పక్కనే నిర్మిస్తున్న మంత్రుల భవనాలు, జడ్జిల నివాసాల వద్ద కూడా ఎక్కడా నీరు నిలవలేదు. ప్రస్తుత హైకోర్టు వద్ద చుక్క నీరు కూడా నిలవలేదు.

ఐకానిక్‌ బిల్డింగ్‌ల వద్ద..

నేలపాడులో ఐకానిక్‌ హైకోర్టు, జీఏడీ, సెక్రటేరియట్‌ టవర్ల వద్ద కూడా వర్షపునీటి ప్రభావం కనిపించలేదు. టవర్‌ 1, టవర్‌ 2ల వద్ద గండి పడటంతో పొలాల్లో నుంచి వచ్చే నీరు రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను ముంచేసింది. ప్రస్తుతం అక్కడ గండిని పూడ్చే పనులు చేస్తున్నారు.ఐకానిక్‌ అసెంబ్లీ నిర్మించే ప్రాంతంలో కూడా నీరు నిలవకపోవడం విశేషం. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల భవనాల వద్ద కూడా పనులకు ఏ ఆటంకమూ కలగలేదు. రాజధానిలో రహదారుల నిర్మాణ పనుల్లో మాత్రం స్వల్పంగా నీరు చేరడంతో పనులకు ఆటంకం కలిగింది. హైకోర్టుకు వెళ్లే రోడ్డుపై ఒక్క చోట మాత్రం స్వల్పంగా నీరు నిలిచింది. రాకపోకలకు ఎలాంటి ఆటంకమూ వాటిల్లలేదు.

Updated Date - Aug 15 , 2025 | 06:09 AM