CM Chandrababu: ఆధునిక పరిశోధనల హబ్‌గా మన క్వాంటమ్ వ్యాలీ
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:06 AM
ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ మారాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
విద్య, వైద్యం, ఔషధాల తయారీకి ఏక్యూసీసీ పనిచేయాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష
వివిధ దేశాల క్వాంటమ్ పరిశోధకులు, పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ
ఔషధాలు, మెటీరియల్ సైన్స్‌పై పరిశోధనలకు గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండ్రీ ఏర్పాటుకు సిద్ధం
అమరావతిలో దేశంలోనే తొలి బయోమెడికల్ ఎకో సిస్టం
సీఎం చంద్రబాబుకు తెలిపిన శాస్త్రవేత్తల బృందం
అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ వ్యాలీ మారాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ) పని చేయాలని సూచించారు. గురువారం క్వాంటమ్ కంప్యూటింగ్, టెక్నాలజీపై పనిచేస్తున్న వివిధ దేశాల పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బృందం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. వైద్యరంగంలో నూతన ఔషధాలతో పాటు మెటీరియల్ సైన్స్‌పై పరిశోధనలకు గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండ్రీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ఆ బృందం సీఎంకు తెలిపింది. దేశంలో తొలి క్వాంటమ్ బయో మెడికల్ రీసెర్చ్ ఎకో సిస్టంగా రూపుదిద్దుకుంటుందని ఆ బృందం వివరించింది. ఈసందర్భంగా గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండ్రీ బృందం సభ్యులకు అభినందనలు తెలిపిన సీఎం.. వైద్యారోగ్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ అంశాల్లో విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని అన్నారు. క్వాంటమ్ పరిశోధనలతో బయో సెన్సార్ల లాంటి అప్లికేషన్లను కూడా ప్రజాప్రయోజనాల కోసం అందుబాటులోకి తేవాలని చెప్పారు. అమరావతిలో త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమౌతాయని వెల్లడించారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని, క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తుంటే మొత్తంగా క్వాంటమ్ ఎకో సిస్టం అమరావతికి వస్తోందని చంద్రబాబు వివరించారు.
క్వాంటమ్ గురించి అంతా ఆలోచిస్తున్న సమయంలో ఆ రంగంలో పని చేయడానికి ఔత్సాహిక కంపెనీలు ఏపీని సంప్రదిస్తున్నాయని సీఎం తెలిపారు. క్వాంటమ్ బయో ఫౌండ్రీ అనేది వినూత్న ఆలోచన అని సీఎం చెప్పారు. క్వాంటమ్ వ్యాలీతో పాటు ఏపీలో అమలవుతున్న విధానాలు తమను ఆకర్షించాయని గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండ్రీ ప్రతినిధులు అన్నారు.