Share News

CM Chandrababu: అమరావతి అధికారికం

ABN , Publish Date - May 24 , 2025 | 03:04 AM

అమరావతిని అధికారిక రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరిన సీఎం చంద్రబాబు. పోలవరం పూర్తి, విశాఖ అభివృద్ధి, మద్యం స్కాం వంటి విషయాలపై కూడా చర్చించారు.

CM Chandrababu: అమరావతి అధికారికం

  • రాజధానిగా నోటిఫై చేస్తూ చట్టం సవరించాలని షాను కోరా: చంద్రబాబు

  • వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సవరణకు చాన్సు

  • తెలిసీ తెలియనితనంతో అమరావతిపై జగన్‌ వ్యాఖ్యలు

  • మూడేళ్లలో రాజధాని కొలిక్కి!

  • అక్కడ బెంగళూరు, హైదరాబాద్‌ కంటే అధునాతన ఎయిర్‌పోర్టు

  • విశాఖను ఆర్థిక కేంద్రంగా మార్చే చర్యలు

  • జగన్‌ మద్యం స్కాంపై షాతో చర్చించా

  • వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం

  • 2027 మార్చిలోపు దానిని పూర్తిచేస్తాం

  • జగన్‌ జమానాలో రాష్ట్రంలో విధ్వంసం

  • మరమ్మతులు చేయలేనంతగా న ష్టం

  • లక్షా 20 వేల కోట్ల బిల్లులు బకాయి

  • రూ.9.94 లక్షల కోట్ల అప్పులు

  • అందుకే ప్రజలు శిక్షించారు: ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ, మే 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ నోటిఫై చేసేందుకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం కొలిక్కి వస్తుందన్నారు. రాజధాని అభివృద్ధి నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నామని.. 2027 మార్చిలోపే పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. నాణ్యత, వేగం విషయంలో ఎలాంటి రాజీ పడబోమన్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలో పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని పేర్కొన్నారని, ఇప్పుడా గడువు పూర్తయి అమరావతి రాజధానిగా ఏర్పడినందున.. ఆ విషయాన్ని పేర్కొంటూ చట్టాన్ని సవరించి నోటిఫై చేయాల్సి ఉంటుందని అమిత్‌ షాకు వివరించానని తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే చట్టాన్ని సవరించే అవకాశాలున్నాయని చెప్పారు. హోం మంత్రితో కలిసి శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించానన్నారు. జగన్‌ మద్యం కుంభకోణంపై కూడా యథాప్రకారం చర్చించానని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మద్యం స్కాంలో అమాయకులను అరెస్టు చేశారని జగన్‌ అంటున్నారని ప్రస్తావించగా.. దర్యాప్తు సాగుతోందని, నేరస్థుల నిర్ధారణ జరుగుతోందని చెప్పారు. కొత్తగా ఆమోదించిన క్రిమినల్‌ లా చట్టాల గురించీ అమిత్‌ షాతో చర్చించానన్నారు.


రాజధానికి అంత భూమి ఎందుకని జగన్‌ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందించారు. ఆయనకొచ్చిన నష్టమేమిటని నిలదీశారు. ‘హైదరాబాద్‌ వంటి నగరాల అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. తెలిసీ తెలియనితనంతో, మూర్ఖత్వంతో ఆయన వ్యాఖ్య లు చేస్తున్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం ఇచ్చేలా నచ్చజెబితే రాజధాని కోసం 29 వేల మంది 34 వేల ఎకరాలు ఇచ్చారు. వారిలో విశ్వాసం కల్పించాం. త్యాగం చేస్తే నష్టపోరని చెప్పాం. రాజధానికి ఏం డబ్బు ఖర్చు పెట్టాం? చరిత్రలో ఇలాంటి ప్రయోగం అమరావతిలోనే సాధ్యమైంది. నేను వ్యక్తులకు సమాధానం చెప్పదలుచుకోలేదు. తెలుగు జాతికి సమాధానం చెప్పదలుచుకున్నా. బెంగళూ రు, హైదరాబాద్‌ విమానాశ్రయాల కంటే అధునాతన విమానాశ్రయం అమరావతిలో ఏర్పడుతుంది. విశాఖను కూడా ఉత్తమ నగరంగా, ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు కార్యాచరణ పథకం చేపట్టాం’ అని వివరించారు.


పట్టాలు తప్పిన అభివృద్ధి..

జగన్‌ హయాంలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరిగిందని, మరమ్మతులు చేయలేనంతగా న ష్టం చేశారని, అభివృద్ధి పూర్తిగా పట్టాలు తప్పిందని చంద్రబాబు చెప్పారు. ఆర్థికంగా వెసులుబాటు లేకుండా చేశారని.. రూ.లక్షా 20 వేల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టి పోయారని.. రూ.9.94 లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు. చరిత్రలో ఎన్నడూ లేని విధ్వంసాన్ని చేసినందుకు జగన్‌ను ప్రజలు శిక్షించారని.. 93 శాతం స్ర్టైక్‌ రేట్‌తో కనీవినీ విజయాన్ని తమకిచ్చారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను పట్టాలపైకి తెచ్చి పునర్నిర్మాణం చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. 92 కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు మంజూరు చేస్తే.. వేరే కార్యక్రమాలకు మళ్లించారని, దీంతో వాటిని కేంద్రం బ్లాక్‌ లిస్ట్‌ చేసిందని.. తామొచ్చాక వాటిలో 74 పథకాలను పునరుద్ధరించామని చెప్పారు. జల్‌ జీవన్‌ మిషన్‌ను అమలు చేయలేదన్నారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తూ.. మరోవైపు అమరావతిలో రాజధానిని నిర్మిస్తూ.. ఇంకోవైపు విశాఖ అభివృద్ధినీ చేపట్టామని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌కు ప్యాకేజీకి తెచ్చి గాడిలో పెట్టామని, రైల్వే జోన్‌ను ప్రారంభించామని వివరించారు.

పోలవరం.. తెలుగుజాతికి వరం

పోలవరం ఏపీ స్వప్నమని, తెలుగుజాతికి వరమని చంద్రబాబు అన్నారు. జగన్‌ డయాఫ్రం వాల్‌ను గోదావరిలో కలిపేశారని.. గతంలో 400 కోట్లతో నిర్మించిన ఈ వాల్‌ను ఇప్పుడు కొత్తగా రూ.980 కోట్లతో పునర్నిర్మిస్తున్నామని.. రెట్టింపు కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.

Updated Date - May 24 , 2025 | 07:06 AM