Share News

Land Allotments: రాజధానిలో పాత పద్ధతిలోనే భూ కేటాయింపు

ABN , Publish Date - Mar 11 , 2025 | 05:00 AM

రాజధాని అమరావతిలో గతంలో భూములు పొందిన 13 సంస్థలకు ఆయా కేటాయింపులను రద్దు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.

Land Allotments: రాజధానిలో పాత పద్ధతిలోనే భూ కేటాయింపు

  • 13 సంస్థలకు ఇచ్చిన భూములు రద్దు

  • 16 సంస్థలకు విస్తీర్ణంలో మార్పులు

అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో గతంలో భూములు పొందిన 13 సంస్థలకు ఆయా కేటాయింపులను రద్దు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో ఆయా సంస్థలకు కేటాయింపులు రద్దు చేసింది. అదేవిధంగా రాజధానిలో భూముల కేటాయింపు గత విధానాన్నే అనుసరించేందుకు ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు అమరావతిలో పలు సంస్థలకు భూము కేటాయింపునకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం సోమవారం సచివాలయంలో భేటీ అయింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్‌, కందుల దుర్గేశ్‌, కొల్లు రవీంద్ర, టీజీ భరత్‌, ఉన్నతాధికారులు సురేశ్‌కుమార్‌, కన్నబాబు, ఇతర అధికారులు హాజరయ్యారు. 2014-19 మధ్య అమరావతిలో భూములు కేటాయించిన సంస్థల విషయంలో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం మంత్రులు నారాయణ, కేశవ్‌ మీడియాతో మాట్లాడారు. అమరావతిలో భూముల కేటాయింపుపై గతంలో ఉన్న విధానాన్నే కొనసాగిస్తామని నారాయణ స్పష్టం చేశారు. గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు తెలిపారు. వీటిలో 31 సంస్థలకు చేసిన కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించామన్నారు.


మరో రెండు సంస్థలకు గతంలో ఇచ్చిన చోట కాకుండా వేరొక చోట కేటాయింపులు చేయనున్నట్టు పేర్కొన్నారు. 16 సంస్థలకు గతంలో కేటాయించిన భూ విస్తీర్ణంలో మార్పులు చేయడంతోపాటు వేరే ప్రాంతాల్లో కేటాయింపులు చేస్తున్నామన్నారు. 13 సంస్థలకు వివిధ కారణాలతో కేటాయింపులు రద్దు చేయనున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.48 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి సంస్థలను ఎంపిక చేసినట్టు తెలిపారు. 23 రోజుల్లో అమరావతి పనులు ప్రారంభమవుతాయన్నారు. రాజధాని కోసం ప్రజల సొమ్ము రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని కేశవ్‌ తెలిపారు. భూముల అమ్మకాలతో మాత్రమే అమరావతి నిర్మాణం జరుగుతుందని ఖజానాపై భారం లేకుండా సీఎం మంచి మోడల్‌ డిజైన్‌ చేశారని చెప్పారు.

Updated Date - Mar 11 , 2025 | 05:00 AM