Land Pooling: రెండో విడతకు సై
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:49 AM
అమరావతి విస్తరణ, అభివృద్ధిలో భాగంగా రెండో విడత భూసమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
రాజధానికి మరో 20,494 ఎకరాలు
సీఆర్డీయేకు సమీకరణ బాధ్యతలు
రెండు జిల్లాలు, ఏడు గ్రామాల్లో ప్రక్రియ
రైతుల నుంచి 16,666.57 ఎకరాలు
ప్రభుత్వ భూములు 3,828 ఎకరాల సమీకరణ
ఈసారి 20,494 ఎకరాల భూసమీకరణ.. సీఆర్డీయేకు బాధ్యతలు
గుంటూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): అమరావతి విస్తరణ, అభివృద్ధిలో భాగంగా రెండో విడత భూసమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 20,494 ఎకరాలను సమీకరించే బాధ్యతను సీఆర్డీయేకు అప్పగించింది. రెండో విడత భూసమీకరణకు రాజధాని రైతులను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించిన విషయం తెలిసిందే. చంద్రబాబు మాటపై తొలి విడత భూసమీకరణకు ఆనాడు అంగీకరించిన రైతులు, తిరిగి అదే స్ఫూర్తిని కనపరిచారు. ఈ నేపథ్యంలోనే రెండో విడత కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా పల్నాడు, గుంటూరు జల్లాల్లోని రెండు మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాలను రైతుల నుంచి సమీకరిస్తారు. మరో 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా విస్తరణకు వినియోగించుకోనున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని నాలుగు గ్రామాల నుంచి 9,616 ఎకరాల భూమిని సమీకరిస్తారు. ఇందులో 7,465 ఎకరాలు రైతుల పట్టా భూములు, 97 ఎకరాలు అసైన్డ్ భూములు, 2,054.23 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. గుంటూరు జిల్లాలో 10,878 ఎకరాల భూమిని సమీకరిస్తుండగా, అందులో 9,097 ఎకరాలు రైతులకు చెందిన పట్టా భూములు, 7.01 ఎకరాలు అసైన్డ్ భూములు, 1,774.07 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. కాగా, మలి విడత భూసమీకరణ విషయంలో రైతుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. గతంలో పలు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులు.... రైతులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలువురు రైతులు రెండో విడత భూసమీకరణను వ్యతిరేకించారు. తొలివిడత భూసమీకరణలో భూములిచ్చిన 29 గ్రామాల రైతుల్లో కూడా మలి విడత భూసమీకరణ పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.