Amaravati Farmers: అమరావతిపై కుట్రతోనే దుష్ప్రచారం
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:38 AM
రాజధాని అమరావతిపై కుట్రతోనే దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్ మీడియాపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు.
జగన్ మీడియాపై చర్యలు తీసుకోండి
తుళ్లూరు పోలీసులకు రైతుల ఫిర్యాదు
పొలాల్లోకి నీరు చేరితే... రాజధాని మునిగిందని పిచ్చి రాతలు రాస్తున్నారు
తుళ్లూరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై కుట్రతోనే దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్ మీడియాపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం రాజధాని పరిధిలోని తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ బాబూరావుకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందించారు.ఈ నెల 12న గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయని, దీంతో కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహించి సమీప గ్రామాలలోని పోలాలు నీటితో నిండిపోయాయని తెలిపారు.అయితే, ఈ నెల 14న జగన్ పత్రికలో పొలాల్లోకి చేరిన నీటికి సంబంధించిన ఫొటోలు ప్రచురించి అమరావతి మునిగిందంటూ తప్పుడు వార్తలు రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమరావతి విషయంలో ఇంకా కుట్రలు పన్నుతూ.. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. అలాగే 16వ తేదీ సాయంత్రం జగన్ చానల్ లైవ్‌లో సైతం అమరావతిపై తప్పుడు కథనాలను ప్రసారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులుగా, రాజధానివాసులుగా తాము ఇలాంటి అసత్య ప్రచారాలు ఖండిస్తున్నామని తెలిపారు. అమరావతిపై ఇలాంటి తప్పుడు కథనాలు, ప్రసారాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.
కృష్ణానదికి ప్రస్తుతం దాదాపు 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా రాజధానికి ఎలాంటి ఇబ్బందీ లేదని ఈ సందర్భంగా రైతులు తెలిపారు. హైకోర్టు, సచివాలయం విధులు సజావుగా జరుగుతున్న విషయాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులని అమరావతిని నిర్వీర్యం చేసి రైతుల త్యాగాలకు విలువ లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అమరావతి మునిగింది, వరద నీరు వచ్చి పడిందనే దుష్ప్రచారాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా మారలేదు
గత ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా వైసీపీ నేతలు మారలేదని రైతులు ధ్వజమెత్తారు. 2 జడ్పీటీసీ ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా మరింత బుద్ధి చెప్పనా.. యథేచ్ఛగా రాజధానిపై కుట్రలు చేస్తున్నారన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు కాక తప్పదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో రైతు నాయకులు వెంకటరెడ్డి, తిరుమల బాబు, శేషగిరిరావు, అప్పారావు, సుబ్బారావు, శ్రీనివాసరావు తదిరులు ఉన్నారు.