Farmers Demand Resolution of Land and Civic Issues: తిట్టించుకోవడానికా.. భూములిచ్చింది?
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:33 AM
రాజధాని అభివృద్ధి ఎంత ముఖ్యమో రైతుల సమస్యలు పరిష్కరించడం అంతే ముఖ్యం. మీ చేత తిట్టించుకోవడానికే భూములిచ్చామా....
సీఎంకే చెప్పుకోండి అంటున్నారు
అంతమాత్రానికి సీఆర్డీఏ ఎందుకు?
సీఎం చంద్రబాబు మమ్మల్ని ఎందుకు కలవరు?
కూటమి వచ్చినా కష్టాలు తీరలేదు
మాకు మళ్లీ పోరాటమే శరణ్యం
రాజధానికి భూములిచ్చిన రైతుల ఆక్రందన
గుంటూరులో అమరావతి రైతు జేఏసీ సమావేశం
నెలాఖరు వరకూ వేచి చూస్తామని, ఆ తర్వాత పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి
గుంటూరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ‘రాజధాని అభివృద్ధి ఎంత ముఖ్యమో రైతుల సమస్యలు పరిష్కరించడం అంతే ముఖ్యం. మీ చేత తిట్టించుకోవడానికే భూములిచ్చామా? సమస్యపై వినతులు ఇస్తే సీఆర్డీఏ అఽధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకే చెప్పుకోండి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతమాత్రానికి సీఆర్డీఏ ఎందుకు? గత ప్రభుత్వంలోలాగే ఈ ప్రభుత్వంలో కూడా రోడ్డెక్కాలా?. ఇదే పద్ధతిలో కొనసాగితే మాకు మళ్లీ పోరాటమే శరణ్యం’ అంటూ రాజధాని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతు ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు చంద్రమౌళి నగర్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధానికి చెందిన పలువురు రైతు నేతలు, మహిళా నేతలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు, సీఆర్డీఏ అధికారుల తీరుపై సమావేశంలో చర్చించారు. ప్రధానంగా సీఆర్డీఏ అధికారుల తీరుపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా తమ కష్టాలు తీరలేదని, సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. ఏపీసీఆర్డీఏ అధికారులు అమరావతి మహిళలు, రైతుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. తమపై పెట్టిన కేసులు ఇప్పటికీ తొలగించలేదన్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, కమిషనర్‌కు 14 సమస్యలను తెలియజేశామని, అయినా ఇప్పటివరకు స్పందన లేదని వాపోయారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల చివర్లో రైతులంతా మరోసారి సమావేశం అవుతామని, ఆ సమావేశంలో పోరాట కార్యాచరణ ఖరారు చేస్తామని నేతలు పేర్కొన్నారు.
రైతులు విన్నవించిన సమస్యలు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంటులో చట్టం చేయడం, సుప్రీం కోర్టులో పెండింగులో ఉన్న మూడు రాజధానుల కేసును, ఆర్-5 జోన్ కేసులను ఉపసంహరించుకోవడం, రిటర్నబుల్ ప్లాట్ల సమస్యలను తక్షణం పరిష్కరించడం, వార్షిక కౌలు బకాయిల చెల్లింపు, హద్దురాళ్లు పోయిన రిటర్నబుల్ ప్లాట్లలో పెగ్ మార్కింగ్ వేసి రాళ్లు వేయడం, ప్రైవేటు సంస్థలకు కేటాయించిన స్థలాల్లో పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూ డడం, రాజధాని గ్రామా ల్లో పదేళ్లుగా ఎన్నికలు జరగక 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయిన కారణంగా, ఆ నిధులు కేటాయించి 29 గ్రామాలను అభివృద్ధి చేయడం, ఇప్పటికీ భూములివ్వని చోట సమీకరణ, లేదా సేకరణ ద్వారా భూములు తీసుకోవడం, గ్రామకంఠ సమస్యల పరిష్కారం, పెండింగులో ఉన్న జరీబు, మెట్ట సమస్యలు, పేదలకు ఇచ్చిన టిడ్కో ఇళ్ల రుణాలపై వడ్డీ బకాయిలకు సంబంధించి మొత్తం 14 రకాల అంశాలపై రైతులు ప్రభుత్వం, సీఆర్డీఏకు విన్నవించారు. ఈ సమస్యల విషయంలో తగిన స్పందన లేకపోవడంతో అమరావతి రైతు ఐక్య కార్యచరణ సమితి ఈ సమావేశాన్ని నిర్వహించింది. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రైతులను కలవడానికి, చర్చించడానికి మొగ్గు చూపడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తక్షణమే చర్చించి, తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రభుత్వం, సీఆర్డీఏ తీరుపై పలువురు నేతలు స్పందించారు. రాజధాని అంశాలపై సీఎంను కలవడానికి, సమస్యలు చెప్పడానికి సీఆర్డీఏ అధికారులు అవకాశం ఇవ్వడం లేదని ఐకాస నేత జమ్ముల శ్యాంకిశోర్ అన్నారు.