Amaravati Development Plans: అమరావతిలో అద్భుత అభివృద్ధి
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:01 AM
రాజధాని అమరావతిలో అద్భుతమైన అభివృద్ధి జరుగబోతోంది. రిటర్నబుల్ ప్లాట్లను రైతులు అమ్ముకోవద్దు. భూముల ధరలు పెరుగబోతున్నాయి....
భూముల ధరలు పెరుగుతాయ్: చంద్రబాబు
రిటర్నబుల్ ప్లాట్లను అమ్ముకోవద్దు
‘రాజధాని’ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
అమరావతి రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత
రాజధాని ఫలాలు తొలిగా వారికే దక్కాలి: సీఎం
రెండో విడత భూసమీకరణకు తాము అనుకూలమని రైతుల ప్రకటన
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో అద్భుతమైన అభివృద్ధి జరుగబోతోంది. రిటర్నబుల్ ప్లాట్లను రైతులు అమ్ముకోవద్దు. భూముల ధరలు పెరుగబోతున్నాయి. బిట్స్ పిలానీ, క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటవుతున్నాయి’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని చెప్పారు. మరోసారి చర్చిస్తామని ప్రకటించారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువును మరికొంత కాలం పాటు పొడిగించే అంశంపైనా కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. గురువారం అమరావతి సచివాలయంలో రాజధాని రైతులతో ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలను ఆలకించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘జరీబు, గ్రామ కంఠాలు, లంక భూములు, రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై రైతుల అభిప్రాయాలు నా దృష్టికి వచ్చాయి. లంక భూములను పూలింగ్‌కు తీసుకోవడానికి అనుమతి ఇచ్చాను. ఇంకా ఏమైనా సమస్యలుంటే ముందుగా త్రిసభ్య కమిటీ తో చర్చించండి. అవసరమైతే నేనూ మాట్లాడతా. ఇకపై రెగ్యులర్‌గా మీ సమస్యలపై సమీక్షిస్తా. రైతులతో మనసు విప్పి మాట్లాడాలి కాబట్టి అన్నీ చెబుతున్నా. అమరావతే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా ఉండాలి. రాజధాని అభివ ృద్ధి చెందాలి. ఇక్కడి అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందు అందుకోవాలి. అమరావతి ప్రాంతానికి రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత. రెండో విడతలోనూ ల్యాండ్ పూలింగ్‌లో భూములు తీసుకుని ఇంకా అభివృద్ధి చేద్దామని చూస్తున్నాం. అభివృద్ధి ఫలాలు ఎలా ఉంటాయో హైదరాబాద్‌ను చూస్తే అర్థమవుతుంది. గతంలో భూములకు అక్కడ చాలా తక్కువ ధర ఉండేది. ఇప్పుడు ఎకరా రూ.170 కోట్లు పలుకుతోంది. కొందరు రైతులు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎ్‌సఐ) పెంచాలని కోరుతున్నారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాను. రైతులు చెప్పే ఏ సమస్యనైనా వీలైనంతవరకు పరిష్కరించేందుకు ప్రభుత్వం సి ద్ధం.అలాగే మీరంతా కలిసికట్టుగా ఉండాలి. ఐకమత్యం గా ఉంటేనే అభివృద్ధి సాధ్యం’ అని చెప్పారు. తిరుమల తరహాలో అమరావతి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
సీఎం ప్లాన్‌తో మాకూ మేలు: రాజధాని రైతులు
‘రాజధాని కోసం జేఏసీలు ఏర్పాటు చేసుకుని ఉద్యమించాం. ఇక అమరావతి డెవల్‌పమెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటాం. రెండో విడత భూ సమీకరణకు పూర్తిగా సహకరిస్తాం’ అని రైతులు సీఎంకు హామీ ఇచ్చారు. ఆయన రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే తమకూ మేలు జరుగుతుందన్నారు. ‘ఎఫ్‌ఎ్‌సఐ పెంపు వల్ల కలిగే లాభనష్టాలను వివరించే బాధ్యత సీఆర్‌డీఏ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి.నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, మున్సిపల్, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.