Share News

Modi Government: అమరావతికి మరింత జోష్‌

ABN , Publish Date - Jun 18 , 2025 | 04:24 AM

రాజధాని అమరావతిలో రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉమ్మడి కేంద్ర సచివాలయం (కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ -సీఎస్ఎస్‌), జనరల్‌ పూల్‌ రెసిడెన్షియల్‌ అకామిడేషన్‌ (జీపీఆర్‌ఏ) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.

Modi Government: అమరావతికి మరింత జోష్‌

  • రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

  • 1,458 కోట్లతో ఉమ్మడి కేంద్ర సచివాలయం

  • 1,329 కోట్లతో కేంద్ర ఉద్యోగుల క్వార్టర్స్‌ కూడా..

  • ఐనవోలులో గతంలోనే 17 ఎకరాలు కేటాయింపు

  • వీటికి మళ్లీ అక్కడే భూములివ్వనున్న సీఆర్‌డీఏ

విజయవాడ/న్యూఢిల్లీ, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉమ్మడి కేంద్ర సచివాలయం (కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ -సీఎస్ఎస్‌), జనరల్‌ పూల్‌ రెసిడెన్షియల్‌ అకామిడేషన్‌ (జీపీఆర్‌ఏ) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. కూటమి ప్రభుత్వ చొరవతో రాజధాని నిర్మాణ పనులు ఊపందుకుంటున్న తరుణంలో ఈ శుభవార్త వినిపించింది. పెండింగ్‌లో ఉన్న ఈ రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను రూ.2,787 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు సంబంధించిన అనుమతులను కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంగళవారం జారీ చేసింది. ఇందులో జీపీఆర్‌ఏకు రూ.1,329 కోట్లు, సీఎస్ఎస్‌కు రూ. 1,458 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఐనవోలు గ్రామంలో గతంలోనే 17 ఎకరాలను సీఆర్‌డీఏ కేటాయించింది. ఇప్పుడు మరోసారి అదే ప్రాంతంలో వీటి కోసం భూములు కేటాయించడానికి సిద్ధమైంది. సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీపీడబ్ల్యూడీ) నేతృత్వంలో పనులు చేపడతారు. రాష్ట్రాల రాజధానుల్లో ఈ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేస్తుంది. 2018లోనే వీటికి నిధులు మంజూరు కావాల్సి ఉన్నప్పటికీ, ప్రతిపాదనల అనంతరం ప్రభుత్వం మారడంతో పెండింగ్‌లో పడ్డాయి. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోలేదు. దీంతో రాజధానిలో నిర్మాణాల ప్రసక్తే లేకుండా పోయింది. దీంతో ఇప్పటివరకు ఆర్థిక ఆమోదం లభించక నిర్మాణం ఆలస్యమైంది. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ సంబంధిత శాఖలతో సంప్రదించి, ప్రతిపాదనలు ఆమోదానికి కృషి చేశారు. ఈ ప్రాజెక్టుల మంజూరుతో అమరావతిలో కేంద్ర మౌలిక అవసరాలకు సంబంధించిన నిర్మాణం వేగవంతం కానుంది.


సీసీఎస్‌ ప్రత్యేకతలివీ..

కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ (సీసీఎస్‌) కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌ అధీనంలో నడుస్తుంది. ఢిల్లీలో నార్త్‌ బ్లాక్‌, సౌత్‌ బ్లాక్‌ మాదిరిగానే ఈ భవనం కూడా ఉంటుంది. ఇందులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కూడిన కేబినెట్‌ సెక్రటరీ విభాగం, అదనపు సెక్రటరీలు, డైరెక్టర్లు, అండర్‌ సెక్రటరీలతో కూడిన వ్యవస్థలు పనిచేస్తాయి. రాష్ట్ర, కేంద్ర సెక్రటేరియట్ల మధ్య ఇది వారధిగా పనిచేస్తుంది. తరచూ ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం లేకుండా కేంద్ర మంత్రిత్వ శాఖలతో ఇక్కడినుంచే సంప్రదింపులు జరపవచ్చు. మైజీవోవీ పోర్టల్‌ ద్వారా ఇంటర్‌ మినిస్ర్టీ కమ్యూనికేషన్స్‌ జరుగుతుంటాయి. నూరు శాతం డిజిటల్‌ గవర్నన్స్‌ దీని ప్రత్యేకత.

జీపీఆర్‌ఏ విశేషాలివీ..

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎ్‌ఫఎస్‌ తత్సమాన కేడర్‌ ఉద్యోగులు, కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు, పీఎ్‌సయూలు తదితరాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల నివాసం కల్పించే వ్యవస్థ జీపీఆర్‌ఏ. ఉద్యోగులకు ఇందులో సబ్సిడీతో కూడిన వసతి సదుపాయం అందిస్తారు. వీటిలో టైప్‌-1 రకాన్ని అసిస్టెంట్‌ సెక్రటరీ స్థాయి కలిగిన వారికి, టైప్‌-2ను డిప్యూటీ సెక్రటరీ స్థాయి, టైప్‌-3ని అదనపు సెక్రటరీ స్థాయి అధికారులకు కేటాయిస్తారు. టైప్‌-4 గృహాలను సెక్రటరీ, కేబినెట్‌ స్థాయి అధికారులకు కేటాయిస్తారు. కాగా, సీసీఎస్‌ ప్రాజెక్టు ఆమోదం పొందడంలో కూటమి ప్రభుత్వ సహకారం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ కీలక పాత్ర పోషించారని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వ సారథ్యంలో, రాష్ట్రాభివృద్ధి పట్ల కేంద్రం చూపిన విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 18 , 2025 | 04:26 AM