Administrative Office: అమరావతిలో సీఆర్డీఏ భవనం సిద్ధం
ABN , Publish Date - Oct 09 , 2025 | 04:20 AM
అమరావతిలో మరో ముఖ్యమైన కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంత అభివృద్ధికి కీలకమైన ఏపీ సీఆర్డీఏ భవనాన్ని ఈనెల 13న...
అమరావతిలో సీఆర్డీఏ భవనం సిద్ధం
13న సీఎం చేతుల మీదుగా ప్రారంభం
3.07 లక్షల చ. అ. విస్తీర్ణంలో భవనం
257 కోట్ల ఖర్చుతో జీప్లస్ 7గా నిర్మాణం
2017లోనే మొదలైన పనులు
జగన్ హయాంలో నిలిపివేత.. పూర్తిచేసిన ‘కూటమి’
గుంటూరు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): అమరావతిలో మరో ముఖ్యమైన కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంత అభివృద్ధికి కీలకమైన ఏపీ సీఆర్డీఏ భవనాన్ని ఈనెల 13న ఉదయం 9.54 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. దాదాపు 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 257 కోట్లతో నిర్మించిన జీప్లస్ 7 భవనం అందుబాటులోకి రానుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక దాదాపు ఆరేళ్ల క్రితం ఆగిపోయిన భవన నిర్మాణం పనులు కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ మొదలయ్యాయి. రాజధాని నిర్మాణం, అభివృద్ధికి ఈ భవన నిర్మాణం కీలకం కావడంతో త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గడిచిన 8 నెలలుగా పనులు నిర్విరామంగా సాగాయి. ప్రతి రోజూ 500 మందికిపైగా కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిరాటంకంగా పనిచేసి ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇకపై అమరావతి నుంచే కార్యకలాపాలు
ప్రస్తుతం విజయవాడ నుంచి సీఆర్‌డీఏ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ భవనం ప్రారంభమయ్యాక ఆ కార్యాలయం అమరావతికి మారనుంది. ఈ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. మిగిలిన అంతస్తుల్లో పురపాలకశాఖ మంత్రి చాంబర్, సీఆర్డీఏ కమిషనర్ చాంబర్, పరిపాలనా విభాగం, ఇంజనీరింగ్ విభాగం, అమరావతి డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏడీసీఎల్) కార్యాలయం, రాజధాని అమరావతి ప్రణాళికా విభాగం, రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక విభాగం ఉంటాయని అధికారులు చెప్పారు. అధికారుల కోసం విడివిడిగా ప్రత్యేక చాంబర్లు, రెండు, మూడు అంతస్తుల్లో సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు భవనం పైభాగంలో ఉద్యోగుల రిక్రియేషన్ కోసం జిమ్ సెంటర్, క్యాంటీన్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఈ 3, ఎన్ 11 జంక్షన్లో కార్యాలయం
సీఆర్డీఏ కార్యాలయ భవనం రాజధాని గ్రామమైన లింగాయపాలెం సరిహద్దుల్లో ఉంటుంది. రాజధాని రవాణా వ్యవస్థలో కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు(ఈ-3), ఎన్ 11 రోడ్ల జంక్షన్లో మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రధాన కార్యాలయ భవనాన్ని 0.73 ఎకరాల్లో నిర్మించారు. గ్రీన్ జోన్ కింద 0.88 ఎకరాలు, పార్కింగ్ కోసం 1.36 ఎకరాలు కేటాయించారు. ఇందులో 176 కార్లు, 176 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే అవకాశం ఉంటుంది. 0.96 ఎకరాలు ఖాళీ స్థలం కింద ఉంచారు. ఏసీ, పవర్ ఎస్టీపీల కోసం 0.39 ఎకరాలు వినియోగించారు. వీటితో అదనంగా 3.07 ఎకరాల్లో ఒక్కోటి 41,500 చ.అ. విస్తీర్ణం ఉన్న 4 ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ) నిర్మాణాలను చేపట్టారు.
సీఆర్డీఏ భవన ప్రత్యేకతలు
2017లో నిర్మాణం ప్రారంభం
2025 అక్టోబరు 13న ప్రారంభోత్సవం
భవనం లొకేషన్.. సీడ్ యాక్సిస్ రోడ్డు, ఎన్ 11 రోడ్డు జంక్షన్
జీ ప్లస్ 7 అంతస్తులో భవనం నిర్మాణం
0.88 ఎకరాలు గ్రీనరీ జోన్
గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ రావడం మరో ప్రత్యేకత
44 శాతం విద్యుత్, 66ు నీటి పొదుపు చర్యలు