AP Govt: వెనక్కి కాదు.. ముందుకే
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:09 AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’కి చట్టబద్ధమైన, కట్టుదిట్టమైన రక్షణ కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
వచ్చే సమావేశాల్లోనే ‘అమరావతి బిల్లు’!
ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ ఆమోదం
ప్రస్తుతం హోం శాఖ పరిశీలనలో.. ప్రభుత్వ వర్గాల వెల్లడి
అమరావతిని జగన్ అడ్డుకోలేరు: పెమ్మసాని
అమరావతి/న్యూఢిల్లీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’కి చట్టబద్ధమైన, కట్టుదిట్టమైన రక్షణ కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం అమరావతి బిల్లును వెనక్కి పంపిందని, ఒకరకంగా ఇది చంద్రబాబుకు ‘షాక్’ అని జగన్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమరావతికి కేంద్రమే రక్షణ కల్పించే బిల్లు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం పొందిందని, ఇక కేబినెట్ ఆమోదం, ఆపై పార్లమెంటులో ఆమోద ముద్రపడటమే తరువాయి అని సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించే అవకాశమున్నట్లు సమాచారం. ‘‘కేంద్ర న్యాయ శాఖ కొన్ని వివరణలు కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సవివరమైన నివేదిక సమర్పించింది. ప్రస్తుతం రాజధాని అంశం హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. పార్లమెంటు ఆమోదం అనంతరం దీనిపై హోంశాఖ నోటిఫికేషన్ జారీచేస్తుంది. అమరావతిలో కీలకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థలను నెలకొల్పేలా, కొన్నింటిని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమన్వయం చేసుకుంటూ నిరంతరం కృషి చేస్తున్నారు. కొన్ని మీడియా వర్గాలు ఈ ప్రయత్నాలను, అమరావతిలో జరుగుతున్న పనులను విస్మరించి... అమరావతిలో ఏమీ జరగడం లేదన్నట్టుగా చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. సీఆర్‌డీఏ కార్యాలయం కార్యకలాపాలు అమరావతిలో ప్రారంభమయ్యాయి. 70కిపైగా సంస్థలు ఇప్పటికే నిర్మాణ పనులు చేపట్టాయి. 10వేల మంది కార్మికులు రాజధాని పనులు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు అమరావతిలో 24గంటలూ పనిచేస్తున్నారు’’ అని ప్రభుత్వం తెలిపింది.
తప్పుడు రాతలతో రాక్షసానందం: పెమ్మసాని
రాక్షసానందం పొందేందుకే వైఎస్ జగన్ అమరావతి గురించి తన పత్రికలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘అమరావతిని శాశ్వత రాజధానిని చేసే బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో గానీ, వచ్చే సమావేశాల్లో గానీ ప్రవేశపెడతాం. కొన్ని సాంకేతిక అంశాలపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. 2014 నుంచి రాజధానిగా గుర్తించాలా? 2024 నుంచి గుర్తించాలా అనే అంశమే కీలకం. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒక నెల ఆలస్యమైనా అమరావతికి కూటమి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ తీసుకొస్తుంది’’ అని పెమ్మసాని తేల్చిచెప్పారు. అమరావతికి నిధులు ఇవ్వొద్దని జగన్, ఆయన మనుషులు వరల్డ్ బ్యాంకుకు ఉత్తరాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అమరావతి’ బిల్లు ఆపాలని ఒత్తిడి కూడా తీసుకొస్తారనే విషయం ప్రజలు గ్రహించాలన్నారు.