Share News

Workers Influx: కార్మికులతో అమరావతి కళకళ

ABN , Publish Date - Dec 29 , 2025 | 03:14 AM

రాజధాని అమరావతి కార్మికులతో కళకళలాడుతోంది. మరో మూడు రోజుల్లో న్యూ ఇయర్‌ వేడుకలు ఉండడం, పండుగ రోజులు కావడంతో అందరూ షాపింగ్‌ చేయడానికి రాజధాని గ్రామాల్లో ఉన్న షాపులకు వచ్చారు.

Workers Influx: కార్మికులతో అమరావతి కళకళ

  • జాతరను తలపిస్తున్న రాజధాని గ్రామాలు

  • ప్రధాన రహదారులు, కూడళ్లలో సందడి

  • ఆదివారం షాపింగ్‌కు వేల మంది రాక

  • త్వరలో 3 రెట్లు పెరగనున్న కార్మికులు

  • ప్రస్తుతం వివిధ పనుల్లో 13 వేల మంది

  • జనవరిలో మరో 30 వేల మంది రాక

  • వైసీపీ హయాం నాటి నిశ్శబ్దానికి తెర

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

రాజధాని అమరావతి కార్మికులతో కళకళలాడుతోంది. మరో మూడు రోజుల్లో న్యూ ఇయర్‌ వేడుకలు ఉండడం, పండుగ రోజులు కావడంతో అందరూ షాపింగ్‌ చేయడానికి రాజధాని గ్రామాల్లో ఉన్న షాపులకు వచ్చారు. వారంలో ఆరు రోజుల పాటు పనుల్లో నిమగ్నమై ఉండే వేలాదిమంది కష్టజీవులు ఆదివారం సెలవు కావడంతో రోడ్ల మీదకు వచ్చి సందడి చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో రోడ్లు, ప్రధాన కూడళ్లు కిక్కిరిసిపోయాయి. బట్టలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. కార్మికుల రాకతో పురవీధుల్లో పండగ వాతావరణం కనిపించింది. దాదాపు ఆరేళ్ల క్రితం వేలాది మంది కార్మికులతో కనిపించిన సందడి మళ్లీ ఇప్పుడు కనిపించింది. 2014-19 మధ్య అమరావతి సందడిగా ఉండేది. వారాంతంలో వేల మంది కార్మికులు తమకు కావాల్సిన నిత్యావసరాల కొనుగోలుకు రోడ్ల మీదకు వచ్చేవారు. పనులు జోరుగా సాగుతున్న సమయంలో నాడు రాజధాని గ్రామాల్లో 50 వేలమందికి పైగా కార్మిక కుటుంబాలు పనిచేసేవి. అప్పట్లో ప్రతి ఆదివారం ఒక జాతరలా ఉండేది. 2019 ఎన్నికల అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధాని పనులను ఎక్కడికక్కడ ఆపేసి నిర్మాణాలను పాడుపెట్టింది. దీంతో కార్మికులు పని కోల్పోయారు. పొట్ట చేత పట్టుకుని వెళ్లిపోయారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతిలో శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలింది.


కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు పునఃప్రారంభమైనప్పటికీ తొలి ఏడాది ఆశించినంత వేగంగా పనులు సాగలేదు. దీనికి తోడు ఈ ఏడాది మే నుంచే వర్షాలు ముంచెత్తడంతో రాజధాని నిర్మాణ పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు రాజధానిలో వేల మంది పనులు చేస్తున్నారు. గత రెండు నెలలుగా వర్షాల తీవ్రత తగ్గడంతో పనులు ముమ్మరమయ్యాయి. ప్రస్తుతం రాజధానికి సంబంధించిన వివిధ పనుల్లో 13 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఆరేళ్లుగా రాజధానిలో రాజ్యమేలిన నిశ్శబ్దం ఎగిరిపోయింది.


త్వరలో మరో 30 వేల మంది రాక

రాజధానిలో పనులు తాజాగా వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పన పనులు కూడా వేగం అందుకున్నాయి. వీటితో పాటు రైతులకు ఇచ్చే ఎల్‌పీఎస్‌ ప్లాట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థలు మానవ వనరుల సరఫరా సంస్థలతో అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నాయి. జనవరికల్లా మరో 30 వేల మంది కార్మికులు అమరావతిలో జరిగే అభివృద్ధి పనుల్లో భాగం పంచుకునేందుకు రాబోతున్నారు. వారు కూడా రాజధానిలో అడుగుపెడితే ఆరేళ్ల క్రితం కనిపించిన అద్భుత దృశ్యం మళ్లీ అమరావతిలో ఆవిష్కృతమవుతుంది. కార్మికుల సందడితో నవనగరం శోభిల్లుతుంది.

Updated Date - Dec 29 , 2025 | 03:16 AM